జీవనోపాధి అవకాశాల మెరుగునకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధి అవకాశాల మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కార్యాచరణపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్ర శక్తి, సీఐఎఫ్, ముద్ర, పీఎంఈజీపీ, ఎంఎస్‌ఎంఈ వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికీ వెళ్లి అర్హులు తగిన వ్యాపారాలు చేసుకునేలా బ్యాంక్ లింక్డ్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఆయా పథకాలకు గుర్తించిన లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు వ్యాపార మెలకువలపై శిక్షణ ఇవ్వాలని, ఉత్పత్తుల విక్రయానికి మార్గాలు చూపాలని, ఆన్‌లైన్ వ్యాపారంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో మహిళ తరఫున ఆమె భర్త లేదా కుమారుడు వ్యాపారం చేసుకునేందుకు ముందుకొచ్చినా పరిగణనలోకి తీసుకొని సహకారం అందించాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు అవగాహన కల్పించాలని, వారి ఎదుగుదలతో ఇతరులకు ఉపాధి కల్పించిన వారవుతారని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ అధికారి చిననరసింహులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షాహిద్ బాబు, మత్స్యశాఖ అధికారి నాగరాజు, పలువురు ఏపీ ఎంలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ


