మట్టి కోసం బరి తెగింపు! | - | Sakshi
Sakshi News home page

మట్టి కోసం బరి తెగింపు!

Jun 2 2025 2:08 AM | Updated on Jun 2 2025 2:08 AM

మట్టి

మట్టి కోసం బరి తెగింపు!

జి.కొండూరు: ప్రకృతి కరుణించినా టీడీపీ నాయకుల దుర్మార్గపు చర్యల కారణంగా సాగునీరు అందడం కష్టమేనన్నట్లు తయారైంది మైలవరం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి. అధికార టీడీపీ నేతల ధనదాహం రైతుల పాలిట శాపంగా మారింది. పొలాలకు మెరక పేరుతో రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు రావుల చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్న టీడీపీ నాయకులు..చివరికి చెరువులోకి నీరు రాకుండా లాకులను సైతం ధ్వంసం చేశారు. మట్టి తవ్వకాల కోసం చెరువులోని కొద్దిపాటి నీటిని సైతం తూముల నుంచి బయటకు పంపించడంతో వారి ధనార్జన పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖరీఫ్‌ సాగు కష్టమే

జూన్‌ నెల ప్రారంభమైన నేపథ్యంలో మరో వారంరోజుల్లో నారుమళ్లను సిద్ధం చేసేందుకు రైతులు సన్నాహలు చేస్తున్నారు. ఈ క్రమంలో రావుల చెరువులో నీరు లేకపోగా చెరువులోకి వచ్చే నీటిని కూడా అక్రమార్కులు అడ్డుకున్న వైనం తెలిసి, నీరు లేకపోతే నార్లు పోయడం కూడా దండగేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాఫ్‌ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. చెరువును నింపేందుకు తాము లాకులను దించినప్పటికీ అక్రమార్కులు వాటిని పదే పదే తొలగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి నీరు వచ్చేలా చర్యలు చేపట్టకపోతే ఆయకట్టు పరిధిలోని 650 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జువ్వి చెరువును గుల్లచేశారు..

ఇదే గ్రామంలో ఉన్న జువ్వి చెరువును టీడీపీ నాయకులు గుల్ల చేశారు. ముగ్గురు రైతులకు పొలాల మెరకపేరుతో 3,100 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలింపునకు అనుమతులు పొంది పదివేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని బట్టీలకు తరలించారు. ఈసారి ఏకంగా రైతుల ముసుగులో బట్టీలను నిర్వహిస్తున్న వ్యక్తుల పేరుతో అనుమతులు పొంది రావుల చెరువు నుంచి భారీస్థాయిలో మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యారు. అనుమతులు తీసుకొచ్చి మట్టి అక్రమరవాణాకు అండగా నిలిచినందుకుగానూ ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టికి రూ.200 కమిషన్‌ రూపంలో బట్టీల నిర్వహకుల నుంచి టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే చర్చ సాగుతోంది. అక్రమార్కుల చేస్తున్న మట్టి దందాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్‌ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి రావుల చెరువు నుంచి అక్రమంగా సాగుతున్న మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

నాగులూరు రావుల చెరువులోకి నీరు రాకుండా అడ్డుకున్న టీడీపీ నాయకులు లాకులు సైతం ధ్వంసం పొలాల మెరక పేరుతో అనుమతులు.. ఇటుక బట్టీలకు మట్టి తరలింపు నిద్రనటిస్తున్న అధికారులు ఖరీఫ్‌ సాగు కష్టమేనంటున్న రైతులు

టీడీపీ నేతల అరాచకం..

రెడ్డిగూడెం మండలం నాగులూరులోని రావుల చెరువు 111ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద నాగులూరు, మైలవరం మండల పరిధిలోని కీర్తిరాయినిగూడెం, తోలుకోడు గ్రామాలకు చెందిన 650 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈ చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్థానిక టీడీపీ నాయకులు పథకం రచించారు. అందులోభాగంగా గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు పొలాల మెరక పేరుతో 11,600 క్యూబిక్‌ మీటర్ల మట్టి అంటే 4,640 ట్రాక్టరు ట్రక్కుల మట్టిని తరలించేందుకు ఇరిగేషన్‌శాఖ నుంచి అనుమతులు పొందారు. ఈ క్రమంలో రెండురోజులపాటు మట్టిని తరలించిన అనంతరం వర్షం పడటంతో ప్రస్తుతం మట్టి రవాణాను నిలిపివేశారు. అయితే వర్షం కారణంగా ఎగువన చెరువులు నిండి కోతుల వాగు నుంచి ఊట వస్తోంది. ఈ ఊట రావుల చెరువులోకి వెళ్లేందుకు చెరువు సమీపంలో లాకులు ఉన్నాయి. చెరువులోకి కోతులవాగు నుంచి నీరు వస్తే మట్టి తవ్వకాలకు అడ్డంకిగా మారుతుందని భావించిన టీడీపీ నాయకులు, లాకులను వారే ధ్వంసం చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మట్టి కోసం బరి తెగింపు! 1
1/2

మట్టి కోసం బరి తెగింపు!

మట్టి కోసం బరి తెగింపు! 2
2/2

మట్టి కోసం బరి తెగింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement