అల్యూమినియం తీగ అపహరణ
తోట్లవల్లూరు: విద్యుత్ తీగల దొంగలు చెలరేగిపోతున్నారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసే అల్యూమినియం తీగలను సైతం చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత నెలలో చాగంటిపాడు వద్ద రూ.4.50 లక్షల అల్యూమినియం తీగల దొంగతనాన్ని మరువక ముందే మళ్లీ బొడ్డపాడు, వల్లూరుపాలెం లైన్‌లో తీగల చోరీ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వల్లూరుపాలెం సబ్‌స్టేషన్ నుంచి బొడ్డపాడు, చినపులిపాక గ్రామాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు కొత్త లైను ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతనెల 28రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 15 స్తంభాల మధ్యలో వేసిన నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన అల్యూమినియం తీగను అపహరించారు. దీని విలువ సుమారు రూ.2.50 లక్షల వరకు ఉంటుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అల్యూమినియం తీగల చోరీ ఘటనపై కాంట్రాక్టర్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిసింది.


