హనుమాన్‌జంక్షన్ రూరల్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగా రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారంటూ హనుమాన్‌జంక్షన్ పీఎస్‌లో నమోదు చేసిన అక్రమ కేసులో ఏ 7 నిందితుడిగా ఉన్న ఓలుపల్లి మోహనరంగాను పోలీస్ కస్టడీ కోరడంతో నూజివీడు న్యాయస్థానం రెండురోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ విజయవాడ జైలులో ఉన్న మోహనరంగాను సోమవారం ఇక్కడకు తీసుకువచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో విచారణ చేశారు. రెండు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం ఆయనకు వైద్య పరీక్షల అనంతరం నూజివీడు కోర్టులో హాజరుపర్చారు. ఆ తర్వాత ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
ఆర్థిక బాధలతో యువకుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆర్థిక బాధలతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై కొత్తపేట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ ఆరోలైన్‌లో మూడియల సాయి, ప్రవీణ్‌కుమార్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ప్రవీణ్‌కుమార్ ప్లాస్టిక్ సామాన్ల షాపులో గుమస్తాగా, సాయి కిరాణా షాపులో పని చేస్తుంటారు. కొంత కాలంగా ప్రవీణ్‌కుమార్ తెలిసిన వారి నుంచి రూ. 12 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో ప్రవీణ్‌కుమార్ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోతున్నాడు.
సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ ఎవరి పనులకు వారు వెళ్లగా, మధ్యాహ్నం సాయి భర్తకు ఫోన్ చేసింది. గోడౌన్‌కు వెళ్లాడని యజమాని చెప్పడంతో తర్వా త ఫోన్ చేస్తానని చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చి త లుపులు తీసే సరికి లోపల ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ ప్రవీణ్‌కుమార్ కనిపించాడు. దీంతో సాయి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ప్రవీణ్‌ను కిందకు దింపి చూడగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద మృతిపై కేసు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టినగర్ సాధుజాన్ వీధికి చెందిన పైడిపాటి లక్ష్మి, నారాయణరావు(50) భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. నారాయణరావు కూలి పనులు, లక్ష్మీ ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆయాగా పని చేస్తుంటుంది. నారాయణరావు కొంత కాలంగా మద్యం సేవిస్తుండటంతో భార్య, పిల్లలు మందలిస్తున్నారు. దీంతో నారాయణరావు తాను చనిపోతానని బెదిరింపులకు దిగే వాడు. ఈ నెల 25వ తేదీ మద్యం తాగి ఇంటికి వచ్చిన నారాయణరావు భార్యతో గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఎలుకల మందు తిన్నాడు.
అతని పరిస్థితి గ్రహించిన లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు కుంకుడుకాయల రసం తాగించి ఎలుకల మందును కక్కించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ నిద్రపోయారు. ఉదయం 6 గంటల సమయంలో నిద్రలేని చూడగా, నారాయణరావు వాంతులు చేసుకుని, మంచంపై విరోచనం చేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే నారాయణరావును ఆటోలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నారాయణరావు కోలుకోలేక మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధ్దారించారు. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


