ఎత్తిపోతలు.. ఎదురుచూపులు
పెనుగంచిప్రోలు: స్థానిక శింగవరం రోడ్డులో మునేరుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. 2022లో ఈ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ డీవీఆర్ బ్రాంచి కాలువ పరిధిలోని పెనుగంచిప్రోలు మేజర్ ఆయకట్టులోని చివరి గ్రామం పెనుగంచిప్రోలు. సాగర్ కాలువకు చివరగా ఉండటంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు సక్రమంగా అందడం లేదు.
చివరి భూముల సాగునీటి కోసం..
చివరి భూముల సాగునీటి కోసం స్థానిక మునేరులో ఐడీసీ ఆధ్వర్యాన రూ.17.23 కోట్ల వ్యయ అంచనాతో దీనిని నిర్మించారు. ఈ పథకం ద్వారా సుమారుగా 2465.02 ఎకరాలకు సాగు నీరు అందేది. పంపుహౌస్‌లో 200 హెచ్‌సీ సామర్థ్యమున్న నాలుగు మోటార్లు, నాలుగు పంపులు ఏర్పాటు చేశారు. నాలుగు పంపుల ద్వారా ఒక రోజులో ఎత్తిపోసే నీరు 30.88 క్యూసెక్కులుగా నిర్ణయించారు.
నిలిచిపోయిన పథకం
గత ఏడాది సెప్టెంబర్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా మునేరుకు వరదలు రావడంతో పక్కనే ఉన్న ఎత్తిపోతల పథకం మొత్తం నీట మునిగింది. లోపల ఉన్న నాలుగు పంపుల్లోకి నీరు చేరి ఒండ్రు పేరుకు పోయింది. ప్యానెల్ బోర్డులు మొత్తం తడిసిపోయాయి. స్కీమ్‌కు సంబంధించిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు విద్యుత్ శాఖవారికి సంబంధించిన మరో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా నీటి లో తడిసి పోయి మరమ్మతులకు గురయ్యాయి. 10 విద్యుత్ స్తంభాలు పడిపోగా స్తంభాలు మాత్రం కొత్తవి వేశారు. పూర్తిగా మరమ్మతులకు గురవ్వడంతో ఎత్తిపోతల పథకం పని చేయడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర రైతులు మరమ్మతులు చేయించుకుంటున్నట్లు తెలిపారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఈ ఎత్తిపోతల పథకం పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం గ్రామ రైతులకు ఉపయోపగపడతాయి. పథకం ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించినా తర్వాత అంతా రైతుల ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. రైతులు ఎకరానికి కొంత వేసుకుని మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాల్సి ఉంది. అయితే వరదలకు చాలా నష్టపోయామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖరీప్ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖరీఫ్‌కై నా పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం బాగుయ్యేనా
వరదలకు దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు..
పంపులు
నిలిచిపోయిన ‘పథకం’
ఆదుకోవాలంటున్న ఆయకట్టు రైతులు
ఎత్తిపోతలు.. ఎదురుచూపులు


