యోగాంధ్రకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): మంగినపూడిబీచ్‌లో ఈ నెల 31వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మంగళవారం మధ్యాహ్నం యోగాంధ్ర కార్యక్రమాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ ఉదయం 7 నుంచి 8గంటల వరకు మంగినపూడిబీచ్‌లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా, ఉపాధిహామీ శ్రామికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. జూన్ 2న 5వేల మందితో అధికారులు, ఉద్యోగులతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు లక్ష్మీటాకీసు సెంటరు నుంచి సాయిబాబా గుడి వరకు ఒకవైపు రహదారిపై యోగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, యోగాంధ్ర సమన్వయ అధికారి పోతురాజు, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు శివప్రసాద్, హరిహరనాధ్, ఎంఎన్ రాణి, డీఎస్‌వో పార్వతి, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ


