
‘ప్రొటోకాల్’కు టికెట్లు తప్పనిసరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలకు టికెట్లు తప్పని సరి చేయండి.. సిఫార్సులపై వచ్చే వారి ఆధార్ నంబర్లతో పాటు వారిని ఎవరు పంపారనే వివరాలు పుస్తకంలో నమోదు చేయండి.. గతంలో ఏం జరిగిందో నేను అడగను.. ఇకపై తప్పనిసరిగా ఇవి చేయండి’ అని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం దుర్గగుడిపై భక్తుల రద్దీ అధికంగా ఉండటంలో కీలక ప్రదేశాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని గమనించి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారుల పేరిట వచ్చిన వారిగా గుర్తించి టికెట్లపై ఆరా తీశారు. ప్రొటోకాల్ ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని స్వస్తి పలికి, ఇకపై ప్రతి ఒక్కరికీ ఒక టికెటు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమయితేనే దేవస్థాన సిబ్బంది ప్రొటోకాల్ దర్శనాలకు రావాలని సూచించారు. అనంతరం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వస్తున్న భక్తులతో మాట్లాడారు. సమాచార కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఈవో సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు సిఫార్సు చేసిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
మహా మండపంలో తనిఖీలు..
మహా మండపం 7వ అంతస్తులోని దేవస్థాన మైక్ ప్రచార కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్‌పీఎఫ్ సిబ్బంది చాంబర్‌లో తనిఖీలు నిర్వహించిన ఆయన డ్యూటీ చార్ట్‌ను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో ప్రాంగణంలో దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీని పరిశీలించి, భక్తులకు పంపిణీ చేశారు.