కార్తికేయ పుణ్యక్షేత్రంలో ఉగాది వేడుకలు
మోపిదేవి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఆలయ ప్రాంగణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు నేతృత్వంలో ఉదయం ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ వేద పండితులు ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. ఉగాది సందర్భంగా దేవస్థానం ఆచార మర్యాదలో భాగంగా శ్రీకాకుళం దేవస్థానం ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం భాస్కరాచార్యులు, పంచాంగ కర్త నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్దప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్, సాయిసుప్రియ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి లడ్డుప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు. ఆలయ అధికారులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం..
వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తరఫున చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఉదయం దేవస్థానం ఎదుట నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు, యాత్రికులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.


