కలెక్టర్ ఢిల్లీరావుకు చెక్కు అందజేస్తున్న అల్ట్రాటెక్ సిమెంట్స్ ప్రతినిధులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటిం చింది. ఈ మేరకు నగరంలోని కలెక్టర్ కార్యాయలంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును గురువారం కలిసి ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. పేద విద్యార్థుల సంక్షేమం కోసం అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సహకారం అభినందనీయమని కొనియాడారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. మన బడి నాడు – నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయని వివరించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులకు తోడు హాస్టళ్ల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమన్నారు. వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు జగ్గయ్యపేట సమీపంలోని బూదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ నిధులను జిల్లాలోని 14 ఎస్సీ, ఎస్టీ, బిసీ సంక్షేమ వసతి గృహాల్లో రక్షిత మంచినీటి వసతి, మరుగుదొడ్డు, కిచెన్ షెడ్ల నిర్మాణం, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు, పెయింటింగ్స్‌కు ఉపయోగిస్తామన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ ఎ.వి.ఎన్.సతీష్ కుమార్, సంస్థ ప్రతినిధులు జి.రజేష్, డి.జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.


