తిర్యాణి: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులకు రోటరీ క్లబ్ సహకారంతో 87 సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గాను సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యుత్ సౌక్యరాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ లైట్లు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదాకు కూడా సోలార్ శక్తి దోహదపడుతుందని పేర్కొన్నారు. పోలీస్‌శాఖ చట్టాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్దికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ అనితారెడ్డి, వెంకటేశ్వరి, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై సుబ్బారావు, సురేశ్ తదితరులున్నారు.


