కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు వినియోగించుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మదిరే అశోక్ అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల నిర్వాహకులకు బుధవారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా పథకంలో కార్యాచరణ, నిధుల కల్పన, స్థానిక ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అంశాలను వివరించారు. జిల్లాలో గుర్తించిన వివిధ ఉత్పత్తులకు మార్కెట్ లభ్యత, నిధుల సదుపాయం, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక అభివృద్ధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సోలార్ వ్యవస్థ, పవర్ ఫ్యాక్టర్ సమస్యలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలపై దృష్టి సారించాని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలు, రాయితీలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీ ఐఐటీ ప్రతినిధి గౌతమ్, ఓడీసీపీ ప్రతినిధి హర్మన్ ప్రీత్ సింగ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి ప్రణయ్, రిచ్ ప్రతినిధి కిశోర్ కుమార్, గ్రీన్‌టెక్ సోలార్ సంస్థ ప్రతినిధి జగన్‌మోహన్, ఏబీబీ ప్రతినిధి యోగేశ్వర్, చంద్రకాంత్ పాల్గొన్నారు.


