జీపీ నిధుల నుంచే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కేంద్ర, రాష్ట్ర నిధులు వినియోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని కార్మికుల విన్నపం
పంచాయతీలపై
కెరమెరి: ఇప్పటికే నిధుల కొరతతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ఇక నుంచి పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి నెలల వేతనాలను కూడా చెల్లించారు. ఈ నిర్ణయంపై పంచాయతీ పాలకవర్గాలు కలవరపడుతున్నాయి. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు భారం కానుంది. పాత పద్ధతిలోనే ప్రభుత్వమే నేరుగా తమ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ లేదా ఇతర అంతర్గత వనరుల నుంచే చెల్లించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో మంజూరు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు మేజర్ పంచాయతీలకు సుమారు రూ.3 లక్షల వరకు నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతోనే పారిశుద్ధ్య పనులు, వేతనాలు చూసుకోవాలని స్పష్టం చేసింది.
పంచాయతీలకు కష్టకాలం
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,012 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరినీ మల్టీపర్పస్ వర్కర్లుగా పరిగణిస్తూ నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. గతంలో ఈ వేతనాల కోసం ప్రత్యేక నిధులు విడుదలయ్యేవి. పంచాయతీ అభివృద్ధి నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు కనీసం మూడు నెలలకోకసారి జీతాలు చెల్లించేవారు. ప్రసుత్తం వేతనాలకు పంచాయతీ నిధులకు ముడిపెట్టడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. గ్రామాల్లో వీధి దీపాలు, బోరు మోటార్ల మరమ్మతు, విద్యుత్ బిల్లుల భారం కూడా పంచాయతీలపైనే పడుతోంది. విద్యుత్ చార్జీలు, వర్కర్ల వేతనాలు చెల్లించగా మిగిలిన నిధులను మాత్రమే అత్యవసర పనులకు వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే నిధులు లేక సర్పంచులు, కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ అదనపు భారం మోయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 నుంచి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి.
బకాయి కోసం మాజీ సర్పంచుల ఒత్తిడి
మరోవైపు చేసిన పనుల బిల్లులు, బకాయిల కోసం మాజీ సర్పంచులు కొత్త పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయించినా బిల్లులు రాలేదని వాదిస్తున్నారు. కొందరు వాస్తవంగా పనులు చేసినా మరికొందరు అక్రమంగా బిల్లులు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న నిధులను వేతనాలు, కరెంటు బిల్లులకే కేటాయించమనడంతో పాత బకాయిలు ఎలా చెల్లించాలో తెలియక కొత్త పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.


