మధ్యాహ్నం నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి
ఆసిఫాబాద్‌అర్బన్: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాత్రివేళ చలి ఉంటుండగా ఉదయం 10గంటలు దాటితే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పశుపక్షాదులు కూడా ఎండలకు అల్లాడుతున్నాయి. కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గతంలోనూ మార్చిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఈనెల 7న పెంచికల్‌పేట మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 నమోదు కాగా, అత్యధికంగా 38.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం బెజ్జూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 18.4 డి గ్రీలు నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 38.6 డి గ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే ఎండ తీ వ్రత ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నా రు. ఎండలు పెరుగుతుండడంతో వీధి వ్యాపారులు పక్కా షెడ్లు లేక గొడుగుల కిందే వ్యాపారాలు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సినవారు ఎండ నుంచి రక్షణకు తలకు టోపీ లేదా టవల్ ధరిస్తున్నారు. జ్యూస్ సెంటర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది. మధ్యాహ్నం వేళ జ్యూస్ సెంటర్లు, కూల్‌డ్రింక్ షాపులు కిటకిటలాడుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండేందుకు రోజుకు తగినంత నీరు తాగాలి. ఇంటి నుంచి బ యటకు వెళ్లేటపుడు తేలికపాటి దుస్తులు, తలకు టోపీ, ముఖానికి మాస్క్, కళ్లకు సన్‌గ్లాసెస్ ధరించాలి. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకువెళ్లకపోవడమే మంచిది. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటే మరీ మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకో వాలి. పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్స్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వ్యాయామం, యోగా, సూర్య నమస్కారాలు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటి ని చల్లగా ఉంచుకోవాలి. పగటి వేళ కిటికీలు, తలు పులు మూసి ఉంచి సాయంత్రం వేళ తెరవాలి. శరీ రంలో ఏవైనా మార్పులు సంభవిస్తే వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
జ్యూస్ సెంటర్ వద్ద సేదతీరుతున్న యువకులు


