మహిళలు నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతీ మహిళ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవీ ఆలయంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఉదయ్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. నేటికీ మహిళల ఆలోచన తీరు పూర్తిగా మారలేదని, ఆర్థికంగా బలోపేతమైతేనే మహిళల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అనంతరం క్లబ్ సభ్యులు కలెక్టర్, ఎమ్మెల్యే, ఏఎంసీ చైర్మన్‌తోపాటు ఎస్‌టీవో కరుణశ్రీ, మహిళా సంఘం సభ్యురాలు మార స్వరూపను శాలువాలతో సత్కరించారు. క్లబ్ ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి
రెబ్బెన: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ హరిత సూచించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని ఆఫీసర్స్ క్లబ్‌లో బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హా జరై బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఎంచుకున్న రంగాల్లో పట్టుదలతో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆ కాంక్షించారు. వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణపత్రాలు అందజేశారు. వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారుల నృత్యాలు అ లరించాయి. సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రెవాల్ సతీమణి ఆర్తి, బెల్లంపల్లి ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు ఎం. పద్మ విజయభాస్కర్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు నరేందర్, సీనియర్ సేవా సభ్యులు శంకరమ్మ, కోమల తదితరులు పాల్గొన్నారు.


