కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఫలితంగానే ఇరాన్ మన చమురు ట్యాంకర్లను సముద్రంలో నిలిపివేసిందని తెలిపారు. ఈ కారణంగానే కేంద్రం గ్యాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటి నుంచో మన మిత్ర దేశమని, మోదీ ప్రభుత్వం అమెరికా మెప్పు కోసం మిత్ర దేశాలతో శతృత్వం పెంచుకుంటోందని ఆరోపించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే యుద్ధాలు, విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యుడు టీకానంద్, నాయకులు కృష్ణమాచారి, సుధాకర్, రవి, రాజేందర్, ముంజం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


