అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకుసాగుతున్నా యూనిఫాం విభాగంలో పని చేయడం కత్తిమీద సామే. అయినప్పటికీ కష్టమైనా ఇష్టంతో అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటవీ సంరక్షణలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మోట్లగూడ సెక్షన్ అధికారి స్వప్న, గిన్నెదరి రేంజ్ అధికారి సరోజ ఉత్తమ అవార్డులు పొందారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
అడవుల రక్షణకు కట్టుబడి విధులు నిర్వహిస్తున్నాం
ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా అడవుల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నాను. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ వారి సలహాలు, సూచనలతో ముందుకు సాగుతున్నాను. నా కూతురును ఐఎఫ్‌ఎ్‌స్ చదివేందుకు సిద్ధం చేస్తున్నాను.
– స్వప్న, సెక్షన్ అధికారి, మోట్లగూడ
కష్టమైనా ఇష్టంతోనే..
అడవిలో విధులు నిర్వహించడం మహిళలకు చాలా కష్టమైన పని. చిన్నప్పటి నుంచి యూనిఫాం సర్వీస్‌పై నాకు మక్కువ ఎక్కువ. ప్రస్తుతం అటవీశాఖలో రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తూ అటవీ పరిరక్షణకు కృషి చేస్తున్నాను. సమాజంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.
– సరోజ, ఫారెస్ట్ రేంజ్ అధికారి, గిన్నెదరి
కత్తి మీద సామే అయినా..
ఇతర ఉద్యోగాలతో పోల్చితే అటవీశాఖ లో విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే. అయినా, ఉన్నతాధికారుల సహకారంతో విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచే యూనిఫాం ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. నా కల నెరవేరింది. దీంతో సంతోషంగా విధులు నిర్వర్తిస్తున్నాను.
– అనూష, అటవీ సెక్షన్ అధికారి, జైనూర్


