ప్రజాపాలన సమర్థవంతంగా నిర్వహించాలి
బెల్లంపల్లి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 17, 31, 32, 33 వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించారు. పారిశుద్ధ్యం పనులను మున్సిపల్ చైర్ పర్సన్‌దావ స్వాతి, వైస్ చైర్మెన్ రాగంశెట్టి సత్యనారాయణ, కమిషనర్ జె.సంపత్‌తో కలిసి పర్యవేక్షించారు. రామ్‌నగర్ బస్తీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్‌లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్‌లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.
పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డు
రియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్‌తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్‌తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్‌లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు.
మత్తుపదార్థాల నివారణే లక్ష్యం
వేమనపల్లి: డ్రగ్స్ రహిత తెలంగాణతోపాటు గంజాయి, నాటుసారా ఇతర మత్తు పదార్థాలపై నివారణే లక్ష్యంగా పని చేద్దామని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని మంగనపల్లి క్రాస్ రోడ్డు వద్ద పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు, పదవ తరగతి విద్యార్థులకు కంపాక్స్ బాక్సులు, ప్యాడ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ క్రిష్ణ, ఎస్సై జగదీష్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి
పాతమంచిర్యాల/లక్సెట్టిపేట: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖి చేసి పురోగతిని పరిశీలించారు. అనంతరం సాయికుంటలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లక్సెట్టిపేట ఆసుపత్రి సందర్శించి రోగులతో మాట్లాడారు. రోగులకు అత్యవసర వేళలో తక్షణమే వైద్యం అందించాలని సూచించారు.


