ఉట్నూర్‌రూరల్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐటీడీఏ పీవో ఛాంబర్‌లో డీటీడీవో, ఏటీడీవోలు, హెచ్‌డబ్ల్యూవోలు, ఐటీడీఏ కార్యాలయ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. శుక్రవారం నుంచి జూన్ 12వరకు 99రోజుల కార్యాచరణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా 10 అంశాలపై కార్యక్రమం కొనసాగుతుందని, మార్చి 6నుంచి 15వరకు ఆశ్రమ పాఠశాలలోని డార్మెంటరీ, కిచెన్, ఆశ్రమ పాఠశాలలో పరిసరాలు, స్టాక్ రూంలు పరిశుభ్రం చేయాలని, పనికిరాని పాత వస్తువులను పోగు చేసి వేలం వేస్తూ వచ్చే డబ్బులతో పాఠశాలలో మరమ్మతు పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్టాక్ రూంలలో ఎలుకలు, బొద్దింకలు, కీటకాలు లేకుండా చూడాలని, పాడైన పప్పులు, సరుకులు, బియ్యం, జీసీసీకి పంపించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రధానోపాధ్యాయులదే బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలని, ప్రతీ ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. పాఠశాలలను కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చని, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను గుర్తించి కాలేజీ ప్రిన్సిపల్, హెచ్‌డబ్ల్యూవోలు, పీఎంహెచ్‌ఎస్, విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క విద్యార్థినీ బడి బయట ఉండకుండా బడిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ అధికారులున్నారు.


