అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య

Mar 6 2026 8:14 AM | Updated on Mar 6 2026 8:14 AM

ఇంద్రవెల్లి: అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని దస్నాపూర్‌గూడకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయన్న, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్నాపూర్‌ పంచాయతీ పరిధి దస్నాపూర్‌గూడకు చెందిన కరాలే సిద్ధేశ్వర్‌ (23) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చిక్సిత పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి వృద్ధుడి ఆత్మహత్య

భైంసాటౌన్‌: కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధుడు గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భైంసా పట్టణంలోని ధోబీగల్లీకి చెందిన తాండ్రోల్ల పోశెట్టి(66) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం గడ్డెన్న ప్రాజెక్టు నీటిలో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్‌ తెలిపారు.

సరిహద్దులో చోరీల కలకలం

కెరమెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం లేండిగూడ గ్రామంలో చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. లేండిగూడ గ్రామానికి చెందిన సూర్యవంశీ రామేశ్వర్‌, భారతి దంపతులు పత్తితీత పనుల కోసం 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కాగజ్‌నగర్‌ మండలానికి వెళ్లారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో లైట్లు వేసి ఉండడాన్ని రామేశ్వర్‌ సోదరుడు నారాయణ గమనించాడు. బీరువా తెరిచి ఉండటంతో రామేశ్వర్‌ దంపతులకు సమాచారం అందించాడు. గురువారం బాధితులు ఇంటికి వచ్చి కెరమెరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీరువాలోని 5 గ్రాముల బంగారు గొలుసు, రూ.16వేల నగదు ఎత్తుకెళ్లారని వారు తెలిపారు. నెల రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ వాగ్మారే శివాజీ ఇంట్లోనూ దొంగలు పడి ఐదు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితులు మహారాష్ట్రలోని జివితి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ నగలు దొంగలు దొరకలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement