ఆదిలాబాద్‌రూరల్: మావల గ్రామ పరిధిలో ఒకే ప్లాట్‌ను పలుసార్లు విక్రయించి పలువురిని మోసం చేసిన కేసులో కీలక నిందితురాలు చింతలపల్లి ఆశాలతను గురువారం అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో మావల గ్రామంలోని సర్వే నంబర్ 175లోని 23వ ప్లాట్‌ను నిందితురాలు రూ.1.10 లక్షలకు రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా విక్రయించింది. అదే ప్లాట్‌ను 1996లో డాక్టర్ మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల ద్వారా వెల్లడైంది. అయితే, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి షేక్ ఇక్బాల్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు తన భర్తతో కలిసి సుమారు 30ఏళ్ల కిందట సర్వే నంబర్ 175లో లేవుట్ రూపొందించి 1996లో ప్లాట్లు అమ్మిన తర్వాత, అవే ప్లాట్లను మళ్లీమళ్లీ ఇతరులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. బాధితులు ప్రశ్నించిన సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు 1996లో జరిగిన అసలు అమ్మకాల రిజిస్ట్రేషన్ పత్రాలు, అనంతరం జరిగిన మోసపూరిత రిజిస్ట్రేషన్ల ఽధ్రువీకరణ పత్రాలు తదితర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్డులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ప్రజలు కనీసం 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు, ఎంకంబ్రెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) పరిశీలించి జాగ్రత్తగా కొనుగోలు చేయాలని సూచించారు.
సుంపుటం శివారులో తాబేలు శిలాజాలు
వేమనపల్లి: మండలంలో ఏ మట్టి దిబ్బల్లో ఏం ఖనిజం ఉంటుందో తెలియదు. ఇక్కడ ఒక్కోరాయి ఒక్కో చరిత్ర చెబుతుంది. వృక్ష, చేప, నత్తగుల్ల, రాకాసి బల్లి, ఎన్నోరకాల శిలాజ అవశేషాలు ఇక్కడ కోకొల్లలు. తాజాగా సుంపుటం సమీప వంతెన వద్ద తాబేలు ఆకృతి శిలాజాలు వెలికిచూశాయి. విధులకు వెళ్లిన అటవీ శాఖ బేస్‌క్యాంప్ సిబ్బంది ఈ శిలాజాలను గమనించి తమ కెమెరాల్లో బందించారు. అక్కడకి సమీప ప్రాణహితా నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా పలురకాల శిలాజాలు ఉన్నాయి. ఏడాది క్రితం రోడ్డు పనుల కాంట్రాక్టర్ వంతెన అప్రోచ్‌రోడ్డుకు బండ రివిట్‌మెంట్ కోసం ఈ అరుదైన శిలాజాలను ధ్వంసం చేశారు. పురాతన చరిత్ర ఆనవాళ్లు కనుమరుగు కాకుండా పురావస్తు, భూగోళ శాస్త్ర అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.


