బాసర:జాతీయస్థాయిలో నిర్వహించిన ఇస్నీ మోటార్ స్పోర్ట్ సీజన్–13లో పోటీల్లో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన టీమ్ గరుడ అసాధారణ ప్రదర్శనతో ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సంపాదించింది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న జట్ల మధ్య కఠిన పోటీలో ఈ ఘటన సాధించడం విశేషం. టీమ్ గరుడ వివిధ విభగాల్లో విజయాలు సాధించింది. యాక్సిలరేషన్‌లో 5.46 సెకన్లలో రికార్డు సమయంతో 1వ ర్యాంక్ సాధించింది. డిజైన్ క్విజ్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ డిజైన్ రివ్యూలో 3వ ర్యాంక్ సాధించింది. డిస్–అసెంబ్లీ/అసెంబ్లీ విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. ఆటోక్రాస్, ఎండ్యూరెన్స్‌లో కూడా నిలకడైన ప్రతిభ కనబర్చింది. థ్రోటిల్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, డ్రైవింగ్ నైపుణ్యాలు, జట్టి సహకారంతో అధిగమించారు.
విద్యార్థులకు అభినందన..
జాతీయస్థాయిలో ఆర్జీయూకేటీ ప్రతిభను చాటిన టీమ్ గరుడ సభ్యులను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ ప్రశంసించారు. ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ కె.మహేశ్, డాక్టర్ ఎన్.విజయ్ కుమార్, విభాగాధిపతి ఎ.చరణ్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అన్పత్ రాహుల్ మార్గదర్శకత్వాన్ని అభినందించారు. స్పాన్సర్లు యునైటెడ్ వే హైదరాబాద్, ఫ్యూచర్ టీచ్ ఫౌండేషన్, వీఆర్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్, ఈఈ సిస్టమ్స్, పీఎస్ అసోసియేషన్‌కు జట్టు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని టీమ్ గరుడ ధీమా వ్యక్తం చేసింది.


