తాంసి: భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామశివారులోగల పంటచేలలో పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గుంజాల గ్రామ శివారులో పంటచేలకు వెళ్లే దారి లో రైతులకు పులి పాదముద్రలు కనిపించడంతో దాని సంచారం ఉందని భయపడుతున్నారు. గ్రా మానికి చెందిన రైతులు ధనోర గ్రామం వైపునున్న పంటచేలకు ఉదయం పూట వెళ్తూ మట్టిరోడ్డుపై పులి పాదముద్రలు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, గత నెల 3న గొల్లఘాట్ శివారులోని పంటచేలల్లో మేతకు వెళ్లిన లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు దాని కదలికలు తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు సెక్షన్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పులి కదలికలను నిరంతరం పరిశీలించారు. దాని కదలికలు కనిపించకపోవడంతో తిరిగి పులి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కానీ, మళ్లీ గుంజాల శివారులో పులి పాదముద్రలు కనిపించడంతో అదే పులి సంచరిస్తూ ఇటు వైపు వచ్చిందా.. లేదా వెరే పులి మహారాష్ట్ర వైపు నుంచి మళ్లీ వచ్చిందా.. అనేది తెలియాల్సి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి పులి నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


