ప్రగతి ప్రణాళికకు సంసిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రణాళికకు సంసిద్ధం

Mar 6 2026 8:13 AM | Updated on Mar 6 2026 8:13 AM

జూన్‌ 12 వరకు 99 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమాలు నేడు జిల్లా ఇన్‌చార్జి మంత్రితో కలెక్టర్ల సన్నాహక సమావేశం 10 అంశాలపై ఫోకస్‌ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా పర్యవేక్షణ

ఆసిఫాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఐదు దశల్లో అమలు చేయనున్నారు. శుక్రవారం నుంచి జూన్‌ 12 వరకు 10 అంశాలతో వ్యవసాయం, విద్య, యువత క్రీడలు, మహిళలు, పర్యావరణం సంబంధిత అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి లోపాలను సరిచేయనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం కలెక్టర్‌ కె.హరిత హైదరాబాద్‌ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణపై జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్‌ శాఖగా వ్యవహరించనుంది.

గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న గ్రామసభలు నిర్వహిస్తారు. 16న మండల స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరో గ్యం, అరైవ్‌– అలైవ్‌, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత– క్రీడలు, మహిళలు, పర్యావరణంపై దృష్టి సారిస్తారు. ఈ నెల 6న శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఆదిలాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో చేపట్టే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 99 రోజుల్లో శాఖల వారీగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు.

పర్యవేక్షణకు మొబైల్‌ యాప్‌ రూపకల్పన

ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపొందించారు. ప్రజలు తమ దరఖాస్తుల స్థితిని పరిశీలించి అప్‌డేట్‌ పొందే అవకాశం కల్పించారు. 10 అంశాల ప్రగతి, గ్రామ సభలు, మండల సమావేశాల వివరాలను మొబైల్‌ యాప్‌లోనే నమోదు చేయనున్నారు. ఫిర్యాదులు, సూచనలు నేరుగా సమర్పించి, వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వం, ప్రజల మధ్య అంతరం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ఈ మొబైల్‌ యాప్‌ విడుదల చేయనున్నారు. గ్రామ సభలు, మండల, జిల్లా స్థాయి సమావేశాల ద్వారా ప్రజలు తమ సూచనలు అందించడంతో పాటు ఫిర్యాదులు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement