రహదారులపై వాహనాలు బోల్తా అతివేగం, ఓవర్ లోడింగే ప్రధాన కారణం నిబంధనలు పాటించని డ్రైవర్లు, యజమానులు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
కర్రతో ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న లారీ అధిక లోడ్ కారణంగా ఫిబ్రవరి 25న ఆసిఫాబాద్ మండలం బూర్గుడ వద్ద ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదేరోజు సిమెంట్ ఇటుకల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు ఎదుట మలుపు తిరుగుతున్న క్రమంలో పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
రెబ్బెన మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సమీపంలో ఫిబ్రవరి 27న బిస్కెట్ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడడంతో సరుకు రోడ్డుపై పడింది. డ్రైవర్ ఖాజా పాషాకు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అలాగే గత నెలలో చింతలమానెపల్లి మండలం కర్జెల్లి సమీపంలో కంకర టిప్పర్ బోల్తా పడింది.
కౌటాల: జిల్లాలోని రహదారులపై వందలాది వా హనాలు, కంకర టిప్పర్లు, సరుకు లారీ రయ్.. రయ్.. అంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అదుపులేని వేగం, పరిమితికి మించి ఓవర్ లోడ్ కారణంగా హెవీ వాహనాలు బోల్తా పడుతున్నాయి. దీనిపై గనుల శాఖ, రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 32 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 18 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. మరోవైపు పోలీస్ శాఖ అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధిస్తోంది. గత నెల 23న రెబ్బెన మండల కేంద్రంలో అధిక లోడ్‌తో వెళ్తున్న 13 లారీలకు రూ.13 వేల జరిమానా విధించారు. అలాగే గత నెల 25న అధిక లోడ్‌తో వెళ్తున్న 19 లారీలకు రూ.16,700 జరిమానా విధించారు.
కఠిన చర్యలు కరువు
వాహనాల రాకపోకలు, ఓవర్ లోడ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. రవాణా శాఖ, మైనింగ్, ఇతర శాఖల అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతూ జరిమానా విధించాలి. అవసరమైతే డ్రైవర్లతోపాటు యజమానులపైనా కేసులు నమోదు చేయాలి. కానీ జిల్లాలో ప్రమాదాలు జరిగిన తర్వాత నామమాత్ర పు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓవర్ లోడ్‌తో దొరికే లారీలను తొలుత సీజ్ చేసి యజమానులకు భారీ ఫైన్లు విధించడం, డ్రైవర్ లైసెన్సు రద్దు చేయడం, మళ్లీ అదే పునరావృతమైతే వాహన పర్మిట్లను రద్దు చేసే అధికారం ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. ట్రక్కుల్లో స రుకులు నింపేటప్పుడే లోడ్ పరిమితులను పాటించేలా, ఒక వేళ ఓవర్ లోడ్‌తో వాహనాలు రోడ్డు మీదకు వస్తే నిర్వాహకులకు భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఓవర్ లోడ్‌తో ప్రమాదాలు
జిల్లాలో వాహనాలు అతివేగం, అధిక లోడుతో ఇష్టారాజ్యంగా దూసుకుపోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్వారీల యజమానులు పొరుగు రాష్ట్రాలకు కంకర తరలించే క్రమంలో గ్రామీణ రోడ్లను వినియోగిస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్లు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా వాహనాల్లో అధిక లోడుతో విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని తరలిస్తున్నారు. మరోవైపు నిత్యం వాగులు, నదుల నుంచి అక్రమంగా ఓవర్ లోడుతో ఇసుక రవాణా సాగుతోంది. ఈ వాహనాలు, టిప్పర్లు, ట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించడం లేదు. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా అవి 25 నుంచి 26 టన్నులు, 12 టైర్ల లారీ 26 టన్నులకు బదులు సుమారు 32 టన్నులకు పైగానే లోడ్‌తో తిప్పుతున్నారు. ట్రాక్టర్లలో సైతం నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువ టన్నులు లోడింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించాల్సి ఉండగా 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. అధిక లోడ్ కారణంగా డ్రైవర్లకు వాహనాలపై కంట్రోల్ కాక అదుపు తప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది.
ప్రత్యేక బృందంతో తనిఖీలు
జిల్లాలో అధిక లోడ్, అతివేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అధిక లోడ్ తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చే శాం. తరచూ తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నాం. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.
– రాంచందర్, ఆర్టీవో


