ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం ఇప్పల నవగాంలోని పట్టా భూమికి పాసుపుస్తకం జారీ చేయాలని జెండాగూడకు చెందిన కామ్రె సోంబాయి దరఖాస్తు చేసుకుంది. మరణించిన తండ్రి పేరుతో గల పట్టా భూమిని తన పేరుతో విరాసత్ చేయాలని బెజ్జూర్ మండలం సలుగుపల్లికి చెందిన జనగాం ఫకీరు విన్నవించాడు. వాంకిడి మండలంలోని తన రిజిస్టర్డ్ మూడు ప్లాట్లకు రూ.43,785 ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని జిల్లా కేంద్రంలోని మార్కండేయ కాలనీకి చెందిన అనుమాండ్ల గణేశ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కౌటాల మండలం వీర్ధండి గ్రామానికి చెందిన సిడాం తుకారాం తన పట్టా భూములను తనకు తెలియకుండా ఇతరులకు పట్టా చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరాడు. కాగజ్‌నగర్‌కు చెందిన అల్స రాజేశ్, జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన కాట్కర్ కల్పన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీపీఆర్వోతో వచ్చే రిజండర్లపై 48 గంటల్లోగా నివేదికలు అందించాలని సూచించారు.
కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి
ఆసిఫాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీపాదరావు ఎనలేని సేవలందించారని కలెక్టర్ కె.హరిత అన్నారు. శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంథని శాసనసభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా శ్రీపాదరావు చేసి న సేవలను కొనియాడారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా, గాంధేయవాదిగా పేరు పొందారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏవో కిరణ్, అధికారులు పాల్గొన్నారు.


