రుణ లక్ష్యం చేరేనా..!
జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.164.76 కోట్ల చెల్లింపులు ఇప్పటివరకు 70.89 శాతం బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు వందశాతం లక్ష్య సాధనకు అధికారుల చర్యలు
తిర్యాణి: మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహయక సంఘాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సంఘాల్లోని సభ్యులకు వారి అవసరాల మేరకు తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేస్తోంది. మహిళలు రుణాలను స్వయం ఆర్థికాభివృద్ధికి కోసం వినియోగించుకుని ప్రతినెలా సులభమైన వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 29 రోజుల గడువు మాత్రమే ఉండగా అధికారులు లక్ష్య సాధనపై దృష్టి సారించారు. ఇప్పటివరకు 70.89శాతం రుణాలు పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గడువులోగా లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.164.76 కోట్ల చెల్లింపులు
స్వయం సహయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.232.43 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు అందించారు. 70.89 శాతం లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో అత్యధికంగా సిర్పూర్(టి) మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.14.77 కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. 414 మహిళా సంఘాలకు రూ.14.67 కోట్ల రుణాలు అందించారు. రెబ్బెన మండలంలో 633 సంఘాలకు రూ.22.60 కోట్ల రుణాలకు రూ.19.72 కోట్లు మంజూరు చేశారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలోని రూ.5.58 కోట్ల రుణ లక్ష్యానికి 142 సంఘాలకు కేవలం రూ.2.49 కోట్లు మాత్రమే అందించారు. ఆ మండలం జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది.
గతేడాది రాష్ట్రస్థాయిలో రెండోస్థానం
ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రుణాలు అందించడంలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేసి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలవడం విశేషం. మరో 30 రోజు ల గడువు ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగి సేలోగా టార్గెట్ చేరుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు రుణాల రికవరీపైనా ఐకేపీ సిబ్బంది దృష్టి సారించారు. నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.
మండలం సంఘాలు లక్ష్యం పంపిణీ
ఆసిఫాబాద్ 538 20.69 15.59
బెజ్జూర్ 352 13.74 6.52
దహెగాం 436 16.33 12.90
జైనూర్ 364 13.03 9.78
కాగజ్‌నగర్ 752 27.71 19.99
రెబ్బెన 633 22.60 19.72
సిర్పూర్(యు) 195 7.07 4.78
సిర్పూర్(టి) 414 14.77 14.67
వాంకిడి 614 22.63 18.88
తిర్యాణి 393 14.13 7.36
పెంచికల్‌పేట్ 193 7.02 3.50
లింగాపూర్ 142 5.58 2.49
కౌటాల 486 17.77 11.29
కెరమెరి 425 15.77 10.38
చింతలమానెపల్లి 357 13.53 6.83
లక్ష్యం చేరుకుంటాం
2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.232.43 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు పంపిణీ చేశాం. గడువు ముగిసేలోగా వందశాతం లక్ష్యం చేరుకుంటాం. ఈ మేరకు సిబ్బందితో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నాం. వందశాతం రుణాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం.
– దత్తారావు, డీఆర్‌డీవో
రుణ లక్ష్యం చేరేనా..!


