చిన్నారులకు ‘ఏకరూప’ కానుక | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు ‘ఏకరూప’ కానుక

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

చిన్న

చిన్నారులకు ‘ఏకరూప’ కానుక

చకచకా సాగుతున్న యూనిఫాం కుట్టు పనులు జిల్లాలో ఇప్పటికే 5,240 మంది చిన్నారులకు అందజేత 15 రోజుల్లో అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీకి చర్యలు

కెరమెరి: అంగన్‌వాడీ కేంద్రాలకు యూనిఫాం పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. చిన్నారులకు వారి కొలతలకు అనుగుణంగా కుట్టిన దుస్తులు అందిస్తున్నారు. మరో 15 రోజుల్లో జిల్లావ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏటా ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు(యూనిఫాం) పంపిణీ చేస్తోంది. తరగతి గదిలో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా విద్యార్థులందరినీ సమాన దృష్టితో చూడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని మరింతగా విస్తరిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలకు వర్తింపజేశారు. చిన్నారులకు సైతం ఏకరూప దుస్తులను అందించాలని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. చిన్నారుల్లో సమానత్వ భావనను పెంపొందించడంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలపై ఆకర్షణ పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఈ మేరకు బాలబాలికలకు సరిపడా యూనిఫాం వ స్త్రం ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. వీటిని కుట్టించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. వస్త్రాన్ని మహిళా సంఘాలకు చెందిన టైలర్లకు అప్పగించగా కుట్టు పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. దుస్తులను తీసుకెళ్లి కుట్టించడంలో తొలుత కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరుకల్లా జి ల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులందరికీ అందించాలన్న లక్ష్యంతో ప్రక్రియను వేగవంతం చే శారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీ స్థాయిలోనే చిన్నారులకు యూనిఫాం అందిస్తుండటంపై తల్లిదండ్రుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.

5,240 మందికి యూనిఫాం

జిల్లాలో ఆసిఫాబాద్‌, జైనూర్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌, వాంకిడిలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 3 నుంచి ఆరేళ్లలోపు బాలురు 12,310 మంది, బాలికలు 12,455 మంది మొత్తం 24,765 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ ఏకరూప దుస్తులు కుట్టిస్తున్నారు. ఈ ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 40 సెక్టార్లు, 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆసిఫాబాద్‌ ప్రాజెక్టు పరిధిలోని 11 సెక్టార్లలో 5,240 మంది చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించారు. వాంకిడి ప్రాజెక్టులోని అన్ని కేంద్రాలకు చెందిన యూనిఫాంలను ఆసిఫాబాద్‌లోనే కుట్టించారు. ప్రస్తుతం ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కాగా, బాలికలకు ఎరుపు, బూడిద రంగు గౌన్లు, బాలురకు ఎరుపు, బూడిద రంగు చొక్కాలు, నీలం రంగు నిక్కర్లు అందిస్తున్నారు. ఒక్కో చిన్నారికి రెండేసి జతల చొప్పున పంపిణీ చేస్తున్నారు.

పాఠశాల ఆవరణలో 434 అంగన్‌వాడీలు

జిల్లాలోని మొత్తం 1,006 అంగన్‌వాడీ కేంద్రాల్లో 434 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లోనే కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 6,784 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. వీరు పాఠశాల విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటున్న నేపథ్యంలో వీరికి గతంలోనే ఒక జత యూనిఫాం అందించారు. త్వరలో రెండో జత అందించనున్నారు. అయితే కొన్నిచోట్ల యూనిఫాంలు కుట్టడంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

15 రోజుల్లో పంపిణీ పూర్తి

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు 15 రోజుల్లో యూనిఫాం పంపిణీ పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆసిఫాబాద్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని కేంద్రాల్లో దుస్తుల పంపిణీ పూర్తి కాగా, మరో రెండు రోజుల్లో వాంకిడి ప్రాజెక్టు వారికి అందిస్తాం. యూనిఫాంలు కుట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో పంపిణీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది

– ఆడేపు భాస్కర్‌, సంక్షేమశాఖ పీడీ

చిన్నారులకు ‘ఏకరూప’ కానుక1
1/1

చిన్నారులకు ‘ఏకరూప’ కానుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement