పంటల సర్వేలో వలంటీర్లు | - | Sakshi
Sakshi News home page

పంటల సర్వేలో వలంటీర్లు

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

పంటల సర్వేలో వలంటీర్లు

పంటల సర్వేలో వలంటీర్లు

నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున చెల్లింపు ఆసక్తి గలవారు ఏఈవోలను సంప్రదించాలని సూచన

కాగజ్‌నగర్‌టౌన్‌: గ్రామాల్లో పంటల సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆసక్తి ఉన్నవారు స్థానికంగా పంటల సర్వేకు ఏఈవోలను సంప్రదించి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వారికి ఏఈవోలు యాప్‌ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు డీసీఎస్‌(డిజిల్‌ క్రాప్‌ సర్వే) యాప్‌లో పేరు, విద్యార్హతలు, బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వేలో భాగంగా పంటల ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున 45 రోజుల సర్వే అనంతరం నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు.

4.45లక్షల ఎకరాల సాగు భూమి

జిల్లాలో లక్షా 36 వేల మంది రైతులు ఉండగా.. వారు 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో 3,35,363 ఎకరాల్లో పత్తి సాగు ఉండగా, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, పెసర, మినుములు, జొన్న, కూరగాయలు తదితర పంటలు 22,395 ఎకరాల్లో సాగు చేశారు. ఇక యాసంగి సీజన్‌లో 50,300 ఎకరాల్లో వరితోపాటు పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, తదితర పంటలు పండిస్తారు.

యువతకు సదావకాశం

పంటలు సర్వే చేసేందుకు గ్రామీణ యువకులకు కేంద్ర ప్రభుత్వం సదావకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సంబంధిత ఏఈవోలను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. జిల్లాలో సర్వే చేసేందుకు యువకులు ముందుకు రావడం లేదు. వచ్చినా వారు కూడా సర్వే చేయడంలేదు. ఈ అవకాశాన్ని ఆసక్తి గలవారు వినియోగించుకోవాలి.

– వెంకట్‌, జిల్లా వ్యవసాయాధికారి

అర్హతలివే..

రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం, ఎరువులు, ఇతర పథకాల అమలు కోసం ప్రభుత్వాలు ఏటా పంటల సర్వే నిర్వహిస్తాయి. ఈ వివరాల ఆధారంగానే ఏ పంట ఎన్ని క్వింటాళ్లు సేకరించాలి.. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. ఎలాంటి ఏర్పాట్లు కల్పించాలి అనే అంశాలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం వలంటీర్లతో పంటల సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అందరూ అర్హులే. గ్రామంలో స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వ్యవసాయం అవగాహన ఉండి, మొబైల్‌ ఆపరేటింగ్‌ వచ్చి ఉండాలి. యాప్‌ ద్వారా సమాచారం అప్‌లోడ్‌ చేయగలగాలి. అప్‌లోడ్‌ చేసే పంట ఫొటోల సంఖ్య ఆధారంగా నగదు చెల్లిస్తారు. 45 రోజుల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అనంతరం వారికి ఎమౌంట్‌ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వలంటీర్లుగా చేసేవారు గ్రామంలోని పొలాలకు వెళ్లి ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేస్తున్నాడో వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. పంటల వివరాలు, రైతు వివరాలు, సర్వే నంబర్‌, సాగు విస్తీర్ణం తదితర వివరాలు పక్కాగా సేకరించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement