అడవిలో మృత్యుపాశాలు
అటవీ సమీప ప్రాంతంలో విద్యుత్ లైన్ కరెంట్ కంచెలతో పెద్దఎత్తున వన్యప్రాణుల వేట గతంలో ఇదే ప్రాంతంలో కే8 పెద్దపులి హతం కేసులు నమోదవుతున్నా మారని వేటగాళ్ల తీరు
పెంచికల్‌పేట్: అటవీ సమీప ప్రాంతాల్లోని విద్యుత్ తీగలను ఆసరాగా చేసుకుంటున్న వేటగాళ్లు రాత్రిపూట అక్రమంగా కరెంట్ కంచె ఏర్పాటు చేసి అటవీ జంతువులను హతమారుస్తున్నారు. వేటగాళ్ల ఉచ్చులకు పెద్దపులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, నీలుగాయిలు, కొండగొర్రె, సాంబార్లు బలవుతున్నాయి. గతేడాది పెంచికల్‌పేట్ రేంజ్‌లోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి కే8 అనే పెద్దపులి మృతి చెందగా.. తాజాగా అదే ప్రాంతంలో గత నెల 22న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి నీలుగాయి మృతి చెందింది. రేంజ్ పరిధిలో విద్యుత్ తీగలు అమర్చి పెద్దపులి, ఎలుగుబంట్లు, దుప్పులు, నీలుగాయిలను వేటాడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్ తొలగింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వేటకు అడ్డుకట్ట పడటం లేదు. పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్నా వారి తీరు మారడం లేదు.
ఒకే ప్రాంతంలో వేట..
పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని ఎల్లూర్, మేరెగూడ, కోయచిచ్చాల, లోడుపల్లి, కొండపల్లి ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడుతున్నారు. కోయచిచ్చాల ప్రాంతం నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైను వన్యప్రాణులకు శాపంగా మారింది. ఇదే ప్రాంతంలో అటవీ జంతువుల సంచారం పెద్దఎత్తున ఉంటుంది. దీంతో ఇదే లైనుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసి ఏటా పదుల సంఖ్యలో వన్యప్రాణులను హతమారుస్తున్నారు. గతేడాది కే8 పెద్దపులి సైతం ఇదే ప్రాంతంలో విద్యుత్ తీగలకు బలికాగా కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు 32 మందిని అరెస్టు చేశారు.
కేసుల నమోదుతో సరి..
వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా వేట నిరంతరం సాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి కల్పించడంతోపాటు నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వేటగాళ్లకు అనువుగా మారుతోంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.
సంరక్షణకు చర్యలు
పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలో వన్యప్రాణులను సంరక్షించడానికి చర్యలు చేపట్టాం. కోయచిచ్చాల సమీపంలోని విద్యుత్ లైన్‌తో వన్యప్రాణులను వేటాడుతున్నారు. వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేశాం. వన్యప్రాణులను వేటాడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అటవీ జంతువుల సంరక్షణకు ప్రజలు సహకరించాలి.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్
ప్రతిపాదనలు పంపించాం
మెరెగూడ నుంచి పాత కోయచిచ్చాల గ్రామం మీదుగా రెవెన్యూ భూమిలో అగర్‌గూడ గ్రామానికి 11కేవీ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ లైన్ తొలగించాలని అటవీశాఖ అధికారులు సంప్రదించారు. లైనుకు కేబుల్ వైర్ వేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే కేబుల్ లైన్ వేసే పనులు ప్రారంభిస్తాం.
– అంజల్‌కుమార్, ఏఈ, పెంచికల్‌పేట్


