నామమాత్రంగా తొలి సమావేశం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిల్ సభ్యుల తొలి సర్వసభ్య సమావేశం శనివారం నామమాత్రంగా సాగింది. చైర్‌పర్సన్ షాహిన సుల్తానా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఉదయం 11 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. అయితే చైర్‌పర్సన్ పక్కన వైస్ చైర్‌పర్సన్ కొత్తపల్లి అనితకు సీటు కేటాయించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సమావేశ హాలులోని నేలపై నిరసన తెలుపుతుండగానే మున్సిపల్ అధికారి రఫిక్ కౌన్సిల్ ఎజెండాలోని ఆరు అంశాలను చదివి 10 నిమిషాల్లోనే ముగించుకుని ఆమోదం పొందినట్లు సమావేశాన్ని ముగించారని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. అనంతరం వారు బయటకు వచ్చి కార్యాలయం ఎదుట కూర్చొని రెండు గంటల పాటు నిరసన తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు తీసుకుని కౌన్సిల్ ఎజెండా ఆమోదం పొందిందని చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. కమిషనర్ తిరుపతి వారిని సముదాయించి చైర్‌పర్సన్ పక్కన వైస్ చైర్‌పర్సన్‌కు కుర్చీ ఏర్పాటు చేయాలనే ఎలాంటి రూల్స్ లేవని స్పష్టం చేశారు.
‘గతంలో కుర్చీ వేశారు..’
కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో చైర్‌పర్సన్ పక్కన వైస్ చైర్‌పర్సన్‌కు కుర్చీ వేశారని, హాలులో ఇద్దరికీ కుర్చీలు ఏర్పాటు చేయాలని జీవో ఉందన్నారు. సమావేశంలోకి పత్రిక విలేకర్లను రానివ్వకపోవడం సరికాదన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారో ప్రజలకు తెలిజేయాలని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశాలకు మీడియాను అనుమతించి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐ ప్రేంకుమార్ కార్యాలయానికి చేరుకుని కౌన్సిలర్లను సముదాయించడంతో వారు నిరసన విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ కొత్తపల్లి అనిత, కౌన్సిలర్లు ఎండీ వలీ, వనమాల శ్రీధర్, వసీం, మాణిక్యరావు, సీపీ విద్యావతి తదితరులు ఉన్నారు.


