అర్హులకు ‘ఉపాధి’ పనులు కల్పించాలి
ఆసిఫాబాద్: ఉపాధిహామీ పథకం కింద అర్హులకు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్నవారికి పని కల్పించే దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి లో పనిప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పనులు కల్పించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలో ఉపాధిహామీ పనులు ప్రారంభించలేదని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
వీసీలో అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులు


