సమరం! | - | Sakshi
Sakshi News home page

సమరం!

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

సమరం!

సమరం!

పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్‌–అలైవ్‌’ నేటితో ముగియనున్న రెండో దశ కార్యక్రమాలు వారంపాటు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

రోడ్డు ప్రమాదాలపై

వాంకిడి: హెల్మెట్‌ ధరించకపోవడం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా సెల్‌ఫోన్లు చూస్తూ వాహనాలు నడుపుతూ అవగాహన లేమితో అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒకే ఘటనతో జీవితాలు మారి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్‌– అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో మొదటి దశలో జనవరి 13 నుంచి 24 వరకు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాలు చేపట్టారు. మళ్లీ రెండో దశలోనూ ఈ నెల 23 నుంచి 28 వరకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పక్కా ప్రణాళికలు రూపొందించారు.

అవగాహన ఇలా..

రోడ్డు భద్రతలో భాగంగా ఎస్పీ నితిక పంత్‌ ఆధ్వర్యంలో తొలి విడతలో అరైవ్‌– అలైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. రోజూవారీగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. రెండో దశలో రోడ్లపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రయాణం, ఓవర్‌ టేకింగ్‌ తనిఖీలు, హెల్మెట్‌ తనిఖీలు, అమలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, నాలుగు చక్రాల వాహనాల తనిఖీలు, సీట్‌ బెల్ట్‌ అమలు, కళాజాత బృందాలతో ప్రత్యేక కార్యక్రమాలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, ధ్రువపత్రాల తనిఖీలు, మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని హెచ్చరికలు, కంటి పరీక్ష శిబిరాలు, భారీ వాహన డ్రైవర్లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ నెల 28న ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. హెల్మెట్‌ లేని కారణంగా ప్రమాదాల బారినపడి మృతి చెందిన కుటుంబాలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి వారితో హెల్మెట్లు పంపిణీ చేయించారు. జిల్లా పోలీసులు మొదటి విడతలో మొత్తం 166 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

రెండు నెలల్లో 32 ప్రమాదాలు..

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 32 రహదారి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అందులో 18 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా నిర్లక్ష్యమే కారణమవుతుందని అధికారులు గుర్తించారు. జిల్లాలో హెల్మెట్‌ ధరించే ద్విచక్రవాహనదారులు అరుదుగా కన్పిస్తుండగా, వందలో పదిమంది కూడా ధరించడం లేదు. హెల్మెట్‌ను బరువుగా భావిస్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెల మాట అటుంచితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం అవగాహన రహితంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం లేదనే అపవాదు ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించేలా, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌ బెల్టు ధరించేలా చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తమ తప్పిదాలు లేకున్నా ఇతరుల నిర్లక్ష్యంతోనూ ప్రమాదాల్లో హెల్మెట్‌ లేని కారణంగా మృత్యువాత పడినవారు అనేక మంది ఉన్నారు. మరికొందరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా మార్పు రావడం లేదు. దీనికి తోడు మైనర్‌ డ్రైవింగ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం బైక్‌లు అతి వేగంగా నడుపుతున్నారు. అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లలు వాహనాలు నడిపితే సంబుర పడుతున్నా.. ప్రమాదాల బారిన పడితే తీరని శోకం మిగులుతుందని గ్రహించలేకపోతున్నారు. అప్రమ త్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.

నిర్లక్ష్య డ్రైవింగ్‌తోనే అధిక ప్రమాదాలు

రెబ్బెన: నిర్లక్ష్య డ్రైవింగ్‌తోనే అధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ నితికపంత్‌ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెబ్బెన మండలం నంబాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. మైనర్లు డ్రైవింగ్‌ చేయొద్దని, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రతిఒక్కరూ భద్రత కోసం ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని కోరారు. నంబాలలో గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతో తమ వారి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ కళాజాత బృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం యువతకు హెల్మెట్‌లు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement