బస్టాండ్‌పై పట్టింపేది..? | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌పై పట్టింపేది..?

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

బస్టాండ్‌పై పట్టింపేది..?

బస్టాండ్‌పై పట్టింపేది..?

కాగజ్‌నగర్‌ ప్రయాణ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు కరువు నాలుగు నెలల క్రితం కంట్రోలర్‌ తొలగింపు ప్రయాణికులకు తప్పని తిప్పలు

కాగజ్‌నగర్‌: జిల్లాలో ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కాగజ్‌నగర్‌ బస్టాండ్‌పై అధికారులు కనీస పట్టింపు చూపడం లేదు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఈ బస్టాండ్‌ నుంచి ప్రతిరోజూ తెలంగాణలోని పలు పట్టణాలు, మహారాష్ట్రకు సైతం బస్సులు ట్రిప్పులు వేస్తుంటాయి. కౌటాల, బెజ్జూర్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, తదితర పట్టణాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్‌, అహేరి పట్టణాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

కంట్రోలర్‌ తొలగింపు

నాలుగు నెలల క్రితం పలు కారణాలతో కంట్రోలర్‌ను విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు బస్సుల టైమింగ్‌ తెలియడం లేదు. ఏ బస్సు ఎప్పుడు వస్తోందో తెలియక.. బస్టాండ్‌లో ఒకరి వద్ద మరొకరు ఆరా తీస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లోనే వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఉక్కపోత తప్పదా..?

వేసవి సమీపించడంతో ఎండలు ముదిరి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడుతున్నారు. కానీ కాగజ్‌నగర్‌ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మూడు ఫ్యాన్లు తిరగడం లేదు. వాటిని ఆన్‌ ఆఫ్‌ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అవి పని చేస్తున్నాయా.. లేక మరమ్మతులు చేపట్టాలా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. అలాగే తాగునీటి కోసం ఏర్పాటు చేసి నల్లా వద్ద పరిశుభ్రత లోపించింది. మరుగుదొడ్లు సైతం కంపుకొడుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

హోంగార్డుకు విధులు

సిబ్బంది కొరతతో కంట్రోలర్‌గా నియమించలేదు. తాత్కాలికంగా సేవలందించేందుకు హోంగార్డుకు కంట్రోలర్‌ పనులు అప్పగించాం. త్వరలోనే పర్మినెంట్‌ కంట్రోలర్‌ను నియమిస్తాం. అలాగే ఫ్యాన్లు బాగు చేయించడంతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం.

– రాజశేఖర్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement