కౌటాలలో స్వల్ప భూప్రకంపనలు
కౌటాల: జిల్లాలోని కౌటాల, పెంచికల్‌పేట్, బెజ్జూర్ మండలాల్లో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. 11.49 నిమిషాల సమయంలో మూడు సెకన్ల పాటు కంపనలు వచ్చాయి. అర్ధరాత్రి ప్రజలు నిద్రలో ఉండడంతో భూకంప ప్రభావాన్ని చాలామంది గుర్తించలేదు. కొందరు మాత్రం చిన్న వస్తువులు కదలడం, ఫ్యాన్లు ఊగడం గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిన విషయాన్ని ఉదయం ఒకరిని ఒక్కరు అడిగి నిర్ధారించుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.9గా నమోదు కాగా, ప్రాణహిత నది తీరంలో కేంద్రంగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లో ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదు.


