ఉద్యాన కేంద్రాలకు జీవం | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన కేంద్రాలకు జీవం

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

ఉద్యాన కేంద్రాలకు జీవం

ఉద్యాన కేంద్రాలకు జీవం

● ఆసిఫాబాద్‌, జంబుగ నర్సరీలకు నిధులు మంజూరు ● మొక్కల పెంపకానికి ఏర్పాట్లు ● స్థానిక కూలీలకు ఉపాధి అవకాశం

ఆసిఫాబాద్‌: కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతున్న జిల్లాలోని ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాలు త్వరలో నవ జీవం పోసుకోనున్నాయి. రాష్ట్ర వనరుల మంత్రిత్వ శాఖ నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ శివారులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజంపేట ఉద్యానవన నర్సరీ శిక్షణ కేంద్రానికి కృషి ఉన్నతి యోజన రాష్ట్రీయ వెదురు మిషన్‌ కింద ఆగ్రోఫారెస్ట్‌ నర్సరీ అభివృద్ధి కోసం రూ.6 లక్షలు మంజూరు చేయగా, కాగజ్‌నగర్‌ మండలంలోని జంబుగ ఉద్యానవన కేంద్రానికి ఆగ్రో ఫారెస్ట్రీ వెదురు మిషన్‌ కింద రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నర్సరీ సదుపాయాలు మెరుగుపర్చి, వృక్ష సంపద పెంపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కేంద్రాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కలు పెంచి ఉద్యానవన అభివృద్ధికి రైతులకు అందించనున్నారు. తద్వారా జిల్లాలో పచ్చదనం పెరిగే అవకాశం ఉంది. నర్సరీల అభివృద్ధితో స్థానిక కూలీలకు ఉపాధి అవకాశం లభించనుంది. ఈ నిధులతో నర్సరీలో మొక్కల పెంపకం, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు దోహదపడనుంది. వెదురు, టేకు, నిమ్మ, పనస, ఎర్రచందనం, మహాగని మొక్కల పెంపకం చేపట్టనున్నారు.

తక్కువ ధరకు మొక్కలు సరఫరా

అతి తక్కువ ధరలో రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిధులు విడుదలైన నేపథ్యంలో ఆసిఫాబాద్‌, జంబుగ ఉద్యానవన కేంద్రాల్లో ఎర్రమట్టి, ఎరువులు తెప్పించి మొక్కల పెంపకానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కూలీలకు ఉపాధి లభించగా, నిధుల కొరత, ఆదరణ కోల్పోయి మొ క్కల ఉత్పత్తి తగ్గిపోయింది. పనులు ప్రారంభమైతే ఆసిఫాబాద్‌, జంబుగ కేంద్రాల్లో మరింత మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. రెండు కేంద్రాల్లో ఇప్పటికే మొక్కల పెంపకానికి ఎర్రమట్టి కుప్పలు పోయించారు.

పూర్వ వైభవం దిశగా..

జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ ఉద్యానవన నర్సరీ పూర్వ వైభవం సంతరించుకోనుంది. 1988 నుంచి 1995 వరకు ఈ ఉద్యానవనం పండ్ల తోటలతో కళకళలాడింది. ఇక్కడ సుమారు వందకు పైగా మామిడి, జామ, సపోట, రేగి తోటలు ఏర్పాటు చేయడంతో ఏటా సుమారు రూ.2 లక్షల ఆదాయం సమకూరేది. ఏటా కూలీలకు సైతం చేతినిండా పని లభించేది. ఐదేళ్లుగా ఉద్యానవన కేంద్రాలను పట్టించుకోకపోవడంతో కూలీలకు ఉపాధి లభించని పరిస్థితి నెలకొంది. తాజా నిర్ణయంతో కూలీలకు మేలు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement