బడుల్లో ‘అభ్యసన’ సర్వే | - | Sakshi
Sakshi News home page

బడుల్లో ‘అభ్యసన’ సర్వే

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

బడుల్లో ‘అభ్యసన’ సర్వే

బడుల్లో ‘అభ్యసన’ సర్వే

రెండో తరగతి విద్యార్థులకు పరీక్షలు జిల్లాలో 53 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక ఇన్వెస్టిగేటర్లుగా ఛాత్రోపాధ్యాయులు నేటితో ముగియనున్న సర్వే

కెరమెరి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పరిశీలించేందుకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో జిల్లాలో సర్వే కొనసాగుతోంది. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా చేపట్టిన ఈ సర్వే బాధ్యతలను ఉపాధ్యాయులకు కాకుండా ప్రస్తుతం బీఈడీ, డీఈడీ చదువుతున్న ఛాత్రోపాధ్యాయులకు అప్పగించారు. వీరిని ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. సర్వే నిర్వహణపై ఎంపిక చేసిన వారికి జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందించారు. ఎస్‌సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను వీరు పరిశీలిస్తున్నారు. ఉర్దూ మాధ్యమంలోని విద్యార్థులకు తెలుగుకు బదులుగా ఉర్దూలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

53 పాఠశాలలు ఎంపిక

జిల్లాలోని 53 పాఠశాలల్లో 53 మంది ఇన్వెస్టిగేటర్లతో సర్వే చేపట్టారు. ఆసిఫాబాద్‌ మండలంలో ఒక పాఠశాలలో సర్వే జరుగుతుండగా.. బెజ్జూర్‌లో 7, దహెగాం 3, జైనూర్‌ 5, కాగజ్‌నగర్‌ 8, కెరమెరి 3, కౌటాల 5, పెంచికల్‌పేట్‌ 2, రెబ్బెన 6, సిర్పూర్‌(టి) 5, సిర్పూర్‌(యు) 3, తిర్యాణిలో 3, వాంకిడిలోని 3 పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్‌, చింతలమానెపల్లి మండలాల్లో మాత్రం ఈ సర్వే చేపట్టలేదు.

నేటితో ముగింపు

ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజులపాటు ఛాత్రోపాధ్యాయుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. జాతీయ విద్యావిధానం– 2020 ప్రకారం ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు గణితంలో నాలుగు రకాల ప్రాథమిక ప్రక్రియలు (కూడికలు, తీసివేతలు వంటివి) చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026– 2027 నాటికి విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో సాధించిన ఫలితాలను బేరీజు వేసేందుకు చేపట్టి ఈ సర్వే శుక్రవారం ముగియనుంది.

ఆ పాఠశాలల్లో సెలవుల్లేవ్‌..

రెండో తరగతి విద్యార్థులకు సర్వే చేపట్టిన దృష్ట్యా సంబంధిత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేశారు. మూడు రోజులపాటు విధిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. సర్వే కోసం వచ్చే ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 25న తెలుగు, 26న గణితం పరీక్షలు పూర్తి కాగా, శుక్రవారం ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాలను పరీక్షించనున్నారు.

అభ్యసన సామర్థ్యాల సాధనకు దోహదం

రెండో తరగతి విద్యార్థులు అభ్యర్థన సామర్థ్యాల సాధన, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వే ఎంతో దోహదపడుతుంది. లోపాలు తెలుసుకునేందుకు ఛాత్రోపాధ్యాయులతో సర్వే నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు పూర్తి సహకారం అందించాలి. అన్ని తరగతుల విద్యార్థులు చక్కటి విద్యాప్రమాణాలు సాధించేలా టీచర్లు కృషి చేయాలి.

– ఉప్పులేటి శ్రీనివాస్‌, క్వాలిటీ కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement