మార్పు మంచికే..
చింతలమానెపల్లి: సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూస్తున్న రైతులకు పంట మార్పిడి మేలు చేస్తోంది. జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు విభిన్న రకాల పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఒక పంట ఆశించిన దిగుబడి ఇవ్వకపోయినా.. మరో పంట ద్వారా నష్టాలను పూడ్చుకుంటున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సాహించడంతో రైతులు సైతం పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. మిరప పంటలో గతేడాది చాలామంది ఎండుతెగులు కారణంగా నష్టాల బారినపడ్డారు. ఫైజోరియా సోకడంతో కారణంగా ఆర్థికంగా నష్టపోయారు. ఎన్ని రకాల ఎరువులు వినియోగించినా దిగుబడులు పెరగడం లేదని రైతులు వాపోతున్నారు.
ఒకే పంటతో దిగుబడి తగ్గుముఖం
రైతు ఏటా ఒకే పంటను ఒకే ప్రదేశంలో పండిస్తే దిగుబడి తగ్గుతుంది. ఒకే పంటను పండించడం ద్వారా నేలలోని పోషకాలు తగ్గి భూసారం దెబ్బతింటుంది. తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పురుగుల మందులు, రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. దీంతో పంట మార్పిడి చేసి సాగు చేయడం ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట మార్పిడి ద్వారా నేలలోని సారం పెరిగి తెగుళ్లు తగ్గుతాయి. ఒక పంటకు అవసరమైన పోషకాలను పంట మార్పిడిలో సాగు చేసే మరో పంట అందిస్తుంది. ఉదాహరణకు మొక్కజొన్న సాగు చేసినప్పుడు ఈ పంట నేలలోని నత్రజనిని వినియోగించుకుంటుంది. పంట మార్పిడిలో పప్పు ధాన్యాలు సాగు చేస్తే పప్పుధాన్యాల ద్వారా నేలకు నత్రజని అందుతుంది. నేలలో పోషకాలను సక్రమంగా వినియోగించడం ద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది.
పంట మార్పిడి వైపు అడుగులు
గత వ్యవసాయ సీజన్లలో పత్తి విత్తనాలు నాటిన రైతులకు వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తనాలు ఎండిపోయాయి. పలుమార్లు విత్తనాలు నాటినా మొలకెత్తని పరిస్థితి. ఈ కారణంగా పలువురు రైతులు కొత్త తరహా పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. నూనె గింజల పంటలకు ఉన్న డిమాండ్ రైతుల్లో కొత్త ఆలోచనలు కలిగించింది. చింతలమానెపల్లి మండలంలో రణవెల్లిలో రైతులు కుసుమ నూనె గింజలను పండిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం, నజృల్‌నగర్, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ పరిధిలో బెంగాలీలు కూరగాయలను సాగు చేస్తారు. మొదటి విడతలో పత్తి, వరి పంటలను సాగు చేసి, కోతల అనంతరం కూరగాయలు పండిస్తున్నారు. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లో ప్రాణహిత, పెన్‌గంగ నదుల తీరాల్లో పత్తి నుంచి రైతులు మొక్కజొన్న, నువ్వులు, పెసర, శనగ పంటలు, తర్బూజ వంటి పళ్లు సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేసి సాగు చేస్తున్న ఈ పంటలు రైతులకు మెరుగైన దిగుబడులు ఇస్తున్నాయి. పంట మార్పిడి చేసి లాభాలు సాధించాలకునే వారు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, వారి భూములకు తగిన పంటలను శాసీ్త్రయంగా సూచనలు వివరిస్తామని తెలియజేస్తున్నారు.
మార్కెటింగ్ సమస్య
చేతికందిన దశలో సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే లాభాలు సాధిస్తామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మార్కెటింగ్ సమస్యగా మారుతున్నట్లు చెబుతున్నారు. పంటల సాగుకు అనుగుణంగా పరిశీలించి కొనుగోలు చేసేలా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
పంట మార్పిడితో దిగుబడి
పంట మార్పిడితో దిగుబడి పెరుగుతుంది. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. పలువురు రైతులు ఈ దిశగా పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పంట మార్పిడిలో ఖరీదైన రసాయనిక ఎరువులు కాకుండా తక్కువ ఖర్చులో సేంద్రియ, సహజ ఎరువులను వినియోగించుకోవచ్చు. సాగులో సలహాలు అవసరమైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
– కార్తీష,
వ్యవసాయ అధికారి, చింతలమానెపల్లి
ఉద్యానవన శాఖ ప్రోత్సాహం
రైతులు సాధారణ పంటలతోపాటు ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలి. పండ్ల తోటలు, పామాయిల్ వంటి వాటితో లాభాలు సాధించవచ్చు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహకాలు అందిస్తోంది. రైతులకు అవసరమైన నీటి సరఫరా పరికరాలను ఇస్తోంది. మామి డి, జామ, నిమ్మ, బొప్పాయి, సంత్ర, పనస డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల సాగుకు 50 శాతం, పామాయిల్ తోటల సాగుకు 90శాతం రాయితీ ఉంది.
– సుప్రజ, హర్టికల్చర్ అధికారి


