ఆందోళన వీడితేనే విజయం | - | Sakshi
Sakshi News home page

ఆందోళన వీడితేనే విజయం

Feb 24 2026 7:06 AM | Updated on Feb 24 2026 7:06 AM

ఆందోళ

ఆందోళన వీడితేనే విజయం

● ఇంటర్‌ విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి ● తొలిసారి సీసీ కెమెరాల నిఘా ● రేపటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం ● డీఐఈవో రాందాస్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆందోళన వీడి పరీక్షలు రాస్తే విద్యార్థులను విజయం వరిస్తుందని జి ల్లా ఇంటర్మీడియెట్‌ నోడల్‌ అధికారి(డీఐఈవో) రాందాస్‌ అన్నారు. పరీక్షలంటే భయం లేకుండా ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా రాస్తే మంచి మార్కులు సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మలుపు తిప్పే ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 10,301 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని, ఐదు నిమిషాల ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సారి పకడ్బందీగా నిఘా నేత్రాల(సీసీ కెమెరాలు) పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ కళాశాలల ఫలితాల్లో రాష్ట్రంలోనే ఒకటి, రెండు స్థానాలను కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కై వసం చేసుకుంటోందని, అదే పట్టుదలతో ఈ ఏడాది కూడా రాష్ట్రంలో నంబర్‌ 1 స్థానంలో నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సాక్షి: ఈ ఏడాది జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? వారి కోసం ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?

డీఐఈవో: జిల్లాలో 2025– 26 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో 5,504 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,797 మంది.. ఇలా మొత్తం 10,301 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో జనరల్‌ విభాగంలో 8,644 మంది, ఒకేషనల్‌ విభాగంలో 1,657 మంది ఉన్నారు. మొత్తం 19 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, రెండు ప్రైవేట్‌ కళాశాలలు, ఆరు ప్రభుత్వ సెక్టార్‌ కళాశాలలు ఉన్నాయి.

సాక్షి: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?

డీఐఈవో: గతంలో లేనివిధంగా వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అన్ని పరీక్ష కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, తగినంత వెలుతురు కోసం లైట్లు, డ్యుయల్‌ డెస్క్‌లతోపాటు అవసరమైన ఫర్నీచర్‌ వంటి అన్ని సౌకర్యాలను కల్పించాం. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు, ఇంటర్నెట్‌, కంప్యూటర్‌, ప్రింటర్‌ సౌకర్యం ఉంటుంది. గైర్హాజరైన విద్యార్థుల సమాధాన పత్రాల బార్‌కోడ్‌లను స్కాన్‌ చేసి ఎప్పటికప్పుడు బోర్డు వెబ్‌సైట్‌కు సమాచారం పంపించేలా ఏర్పాట్లు చేశాం. అత్యవసర వైద్య సహాయం కోసం ఏఎన్‌ఎంలు కూడా అందుబాటులో ఉంటారు.

సాక్షి: ఆలస్యంగా వచ్చే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారా?

డీఐఈవో: పరీక్ష సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే జవాబు పత్రాలు అందజేస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే అనుమతించేది లేదు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.

సాక్షి: మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఎలాంటి నిఘా చర్యలు తీసుకున్నారు?

డీఐఈవో: ఈసారి ప్రతీ సెంటర్‌లో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. సీసీ ఫుటేజీ పరీక్ష సమయంలో ఇంటర్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఉండదు. సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశాం. డిపార్ట్‌మెంటల్‌ బృందంతోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో జూ నియర్‌ లెక్చరర్లు, రెవెన్యూ అధికారులు, ఏఎస్సైలు ఉంటారు. జిల్లా పరీక్ష కమిటీతో పాటు కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు కూడా తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనలు అతిక్రమించి కాపీయింగ్‌ను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదు.

సాక్షి: ఇంటర్‌ ఫలితాలపై మీ అంచనా ఏమిటి? విద్యార్థులను ఏ మేరకు సిద్ధం చేశారు?

డీఐఈవో: గతేడాది మన జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది నం.1 స్థానానికి చేరే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాం. కొన్నేళ్లుగా వస్తున్న ఉత్తమ ఫలితాలను చూసి ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అకాడమిక్‌ మానిటరింగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల మార్కులపై నిరంతరం దృష్టి సారించాం. విద్యార్థులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నమూనా ప్రశ్నపత్రాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం.

ఆందోళన వీడితేనే విజయం1
1/1

ఆందోళన వీడితేనే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement