మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్
ఆసిఫాబాద్: జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ట్రైయినీ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్యలతో కలిసి తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో కంపెనీలు, టీఫైబర్ ప్రతినిధులతో సెల్‌టవర్ల ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఎయిర్‌టెల్, జియో సంస్థల టవర్ల నిర్మాణాలు, స్థలం గుర్తింపు, పాలనపరమైన అనుమతులు త్వరగా పొందాలని తెలిపారు.
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి
మతసామరస్యంతో శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. రంజాన్ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్, ట్రెయినీ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మసీదుల వద్ద ప్రతిరోజూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడే, తహసీల్దార్లు రియాజ్ అలీ, మధుకర్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పాల్గొన్నారు.


