బాధితుల రక్షణే ప్రథమ లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్: బాధితుల రక్షణే పోలీసుశాఖ ప్రథమ లక్ష్యమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య స్థితి, పరిష్కారానికి పలు సూచనలు చేశారు. పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు.
వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ట్రిపుల్ రైడింగ్, మైనర్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా శబ్ద కాలుష్యం సృష్టించే సైలెన్సర్లు ఉన్న ద్విచక్రజు వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు వాహనదారులు ఫ్యాన్సీ డిజైన్, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. రాంగ్‌సైడ్ పార్కింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, బాధ్యతారాహిత్యంగా ఓవర్ లోడ్ వాహనాలు నడపొద్దన్నారు. తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు.


