సిర్పూర్(టి) రేంజ్‌లోనే బెబ్బులి
సిర్పూర్(టి): సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచరిస్తోంది. గ్రామాల పరిసర ప్రాంతాల్లో తరుచూ ఆవులు, ఎద్దులు, మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తోంది. ఏడాది కాలంగా సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోనే పెద్దపులుల సంచారం అధికంగా ఉంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఏడాది కాలంలో మేడిపల్లి శివారులో ఒక ఆవు, వేంపల్లి శివారు అటవీ ప్రాంతంలో రెండు ఆవులు, చీలపెల్లి అటవీప్రాంతంలో నాలుగు ఆవులు, ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతంలో ఆరు ఆవులు, ఎద్దులు, మాకిడిలో మరో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆవులు, ఎద్దులు, మేకలు కోల్పోయిన రైతులకు అధికారులు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంతోపాటు పూర్తి పరిహారం సకాలంలో అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
నిత్యం ట్రాకింగ్..
సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులులను అటవీశాఖ అధికారులు, టైగర్ ట్రాకర్స్, వాచర్స్ నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ అడవుల్లో తిరుగుతూ బెబ్బులి ఆనవాళ్లు గుర్తిస్తున్నారు. పెద్దపులులకు హాని కలిగించే పరిస్థితులను గుర్తిస్తున్నారు. పెద్దపులి కదలికలు కనిపిస్తే అప్రమత్తమై గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతోపాటు ఇతర వన్యప్రాణులు, పశువుల రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారు. అలాగే అడవులకు సమీపంలో ఉన్న రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. దట్టమైన అటవీప్రాంతాలకు పశువులు, మేకలు తీసుకెళ్లొద్దని, ఒంటరిగా వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నారు.


