ప్రమాద నివారణలో జాప్యం
గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా నేటి పరిస్థితులు మారుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అగ్ని ప్రమాదాలు అవకాశం ఉండే వ్యవసాయ ఉత్పత్తుల ఆధార పరిశ్రమలు, మిల్లుల నిర్మాణం జరుగుతున్నాయి. చింతలమానెపల్లి మండలంలో గత రెండు సంవత్సరాల్లో నాలుగు భారీ తరహా రైస్ మిల్లులు, నిల్వ గోదాములు ఏర్పాటు కాగా, కౌటాల మండలంలో మూడు జిన్నింగ్ మిల్లులు, మరో ఎనిమిది భారీ తరహా రైస్ మిల్లులు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ప్రమాదాలు జరిగిన తర్వాత కాగజ్‌నగర్‌లోని కేంద్రం నుంచి ఫైరింజన్ సంఘటన స్థలానికి చేరుకునేసరికి బాధితులకు తీరని నష్టం జరుగుతోంది. దూరం కారణంగా సరైన సమయంలో వాహనం సంఘటన స్థలానికి చేరుకోలేపోతోంది. గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా బాధితుల నష్టాన్ని తగ్గించలేకపోతున్నాయి. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఒక్కోసారి గాలులు ఉండడంతో మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాప్తి చెందుతున్నాయి.


