జంగుబాయి ఉత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

జంగుబాయి ఉత్సవాలకు వేళాయె

Dec 21 2025 9:38 AM | Updated on Dec 21 2025 9:38 AM

జంగుబ

జంగుబాయి ఉత్సవాలకు వేళాయె

మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన దేవత ఆదివాసీ భక్తులకు ఆరాధ్య దైవం రేపటి నుంచి జనవరి 17 వరకు ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

జంగుబాయి గుహ

ముస్తాబైన అమ్మవారి ప్రాంగణం

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదాస్పద ప్రాంతం కెరమెరి మండలం ముకదంగూడ గ్రామ పంచాయతీకి చెందిన మహరాజ్‌గూడ అడవుల్లో జంగుబాయి దేవత కొలువైంది. నియమనిష్టలతో, భాజాభజంత్రీల నడుమ ఆదివాసీలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు జంగుబాయి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహరాజ్‌గూడ అడవుల్లో ఉన్న బోరు నుంచి పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు హాల్‌, పోచమ్మ ఆలయానికి రంగులు వేశారు. 20 సోలార్‌ విద్యుత్‌ లైట్లను సైతం అమర్చనున్నారు. ఆలయ క్షేత్రం వరకు సీసీ రోడ్డు కూడా వేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గమనార్హం.

ఎనిమిది గోత్రాలు ఒకే వేదికపై..

తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని జంగుబాయి వారసులు వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హెర్రకుంరం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారంతా కాలిబాట, ఎడ్లబండ్లపై వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పుజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికి కూడా మొక్కులు తీర్చుకుంటారు. తమ ఇళ్లకు తాళాలు పెట్టి ఎనిమిది కుటుంబాలకు చెందిన ఆదివాసీలు ఈ ఉత్సవానికి తరలివస్తారు. సుమారు వెయ్యికి పైగా ఎడ్లబండ్లు వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారు చేసి సంప్రదాయ వాయిద్యాలతో గుహలోకి వెళ్లి అమ్మ వారిని దర్శించుకుంటారు. అక్కడున్న మైసమ్మ, పోచమ్మ, రావుడ్‌ దేవతల వద్దకు వెళ్లి మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి వంటలు చేసి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలు చేస్తారు. దారి మధ్యలో ఉన్న టొప్లకసకు వెళ్లి పూజలు చేస్తారు.

ప్రభుత్వం గుర్తింపుతో అభివృద్ధి..

ఎనిమిదేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జంగుబాయి ఉత్సవాలకు గుర్తింపు ఇచ్చింది. ఏటా రూ.10 లక్షలు అభివృద్ధి కోసం విడుదల చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, సత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇ తర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

చేరుకోవడం ఇలా..

జంగుబాయి పుణ్యక్షేత్రానికి కెరమెరి మండలం నుంచి ఆనార్‌పల్లి మీదుగా ఉమ్రి వంతెన నుంచి పరందోళి మీదుగా, లేదా పరంధోళి సమీపం నుంచి ముకదంగూడ గ్రామానికి ఆనుకుని ఉన్న కచ్చా రోడ్డు గుండా వెళ్లవచ్చు. లేదా నార్నూర్‌ క్రాస్‌రోడ్డు నుంచి కొత్తపల్లి మీదుగా, ఆదిలాబాద్‌ నుంచి లొకారి మీదుగా జంగుబాయి క్షేత్రానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.

గుహలో కొలువు..

ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవత గుహలో కొలువై ఉంది. గుహ కావడంతో భక్తులు కూర్చునే వెళ్లాల్సి ఉంటుంది. గుహలో దీపం వెలుగులో దేవత భక్తులకు దర్శనమిస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసీలు విశ్వసిస్తారు. పుష్యమాసంలో కనిపించిన నెలవంక నుంచి ప్రారంభమైన జంగుబాయి జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది.

ఎత్తయిన గుట్టలు.. చుట్టూ అడవుల మధ్య ఆదివాసీల కొంగుబంగారంలా విరాజిల్లుతోంది జంగుబాయి పుణ్యక్షేత్రం. లక్షలాది మంది ఆదివాసీలు ఆరాధించి పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు ఈ నెల 22న నిర్వహించే దీపస్వరూప్‌తో ప్రారంభం

కానున్నాయి. ప్రతీ సంవత్సరం పుష్యమాసం నుంచి నెల రోజులు పాటు ఉత్సవాలు

కొనసాగుతాయి.

– కెరమెరి(ఆసిఫాబాద్‌)

జంగుబాయి ఉత్సవాలకు వేళాయె1
1/2

జంగుబాయి ఉత్సవాలకు వేళాయె

జంగుబాయి ఉత్సవాలకు వేళాయె2
2/2

జంగుబాయి ఉత్సవాలకు వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement