రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీ రోడ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఆటోడ్రైవర్, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్‌కు చెందిన మెడపట్ల వెంకటేష్ తన ఆటోలో బాబానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల టీచర్లు, మరికొందరు ప్రయాణికులతో మంచిర్యాలకు వస్తున్నాడు. మంచిర్యాల నుంచి క్వారీ వైపు వెళ్తున్న ఓ కారు రాంగ్ రూట్లో వచ్చి అతివేగంగా ఆటోను ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ వెంకటేష్, ఇద్దరు ప్రభుత్వ టీచర్లకు స్వల్ప గాయలయ్యాయి. కారులో న్యాయవాది లోగో, నల్గొండ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఐడీ కార్డు లభించడం చర్చనీయాంశమైంది. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావును సంప్రదించగా.. ఫిర్యాదు రాలేదని తెలిపారు.


