విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
నిర్మల్‌టౌన్: విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడలను ప్రారంభించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో 50 మంది బాలికలు, 100 బాలురు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, పీడీలు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కేకే–ఓసీలో ప్రమాదం.. దెబ్బతిన్న డంపర్లు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీలో రెండ్రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు డంపర్లు దెబ్బతిన్న విషయం ఆలస్యంగా తెలిసింది. గురువారం రెండో బదిలీలో ఓసీలోని పని స్థలంలో షావల్ ఆపరేటర్ బొగ్గు నింపుతుండగా డంపర్ వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. వరుస క్రమంలో రావాల్సిన ఓ డంపర్ వాహన చోదకుడు తొందరపడి ముందు డంపర్ లోడ్ కాకముందే తీసుకెళ్లి నిర్లక్ష్యంగా నిలిపి డ్రైవర్ సీటు నుంచి పక్కకు వచ్చినట్టు సమాచారం. డంపర్ నిలిపినప్పుడు పాటించాల్సిన దూరం, బ్రేకులు వినియోగించకపోవడంతో ఆ డంపర్ వెనుకకు కదిలి మరో డంపర్‌ను ఢీకొట్టగా రెండూ దెబ్బతిన్నాయి. ఉద్యోగి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిలో ఇలాంటి సంఘటనే జరిగి ఓ ఆపరేటర్ మృతిచెందాడు. అధికారులు ఈ విషయాన్ని బయటకు తెలి యనీయకుండా, రక్షణ చర్యలు విఫలమైనా పట్టించుకోకుండా ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.


