ధ్యానం.. జీవనరాగం
ఆదిలాబాద్: ధ్యానం అంటే కేవలం కళ్లు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదని, ఆలోచనలు నియంత్రించుకోవడం, మనసును శాంతపరచుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడమేనని ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. మరోవైపు పరిశోధనలు సైతం ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గడం, ఏకాగ్రత పెరగడం, నిర్ణయక సామర్థ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం నేపథ్యంలో కథనం..
ఎన్నో ప్రయోజనాలు..
ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతమై ఆలోచనలపై నియంత్రణ సాధ్యమవుతుంది. ఆందోళన, కోపం, నిరాశ వంటి భావాలు క్రమంగా తగ్గుతాయి. ధ్యానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరగడం ధ్యానం వల్ల కలిగే మరో లాభం. ఆరోగ్యంపరంగా కూడా ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడం, హృదయ ఆరోగ్యం మెరుగుపడటం, నిద్ర సమస్యలు తగ్గడం వంటి లాభాలు ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా ధ్యానం సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం కదలకుండా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మొదట్లో కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేసి దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఐదు నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా పది లేదా ఇరవై నిమిషాలకు పెంచుకోవచ్చు.


