భూమికోసం కొట్లాట.. ఒకరికి కత్తిపోట్లు
నార్నూర్: గాదిగూడ మండలం మేడిగూడ గ్రామంలో శనివారం భూతగాదాలలో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. ఎస్సై ప్రణయ్, స్థానికుల కథనం ప్రకారం.. మేడిగూడ గ్రామానికి చెందిన రామ్ సిందే, ఆకాష్ సిందేలు వరుసకు బాబాయ్ కొడుకులు. బాబాయ్ అయిన రామ్ సిందే ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి పొలం పనికి వెళ్లాడు. గమనించిన ఆకాష్ సిందే వెనకాలే వెళ్లగా, ఇద్దరు భూమి విషయంలో గొడవపడ్డారు. గొడవ పెద్దది కాగా గ్రామానికి వచ్చిన తర్వాత కూడా మాటమాట పెరిగింది. ఆగ్రహానికి గురైన ఆకాష్ సిందే తన బాబాయ్ రామ్ సిందేపై వెనుక భాగాన రెండు చోట్ల కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులపై సైతం దాడికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రామ్ సిందేను వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రామ్ సిందే భార్య విజయమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ తెలిపారు.


