చికిత్స పొందుతూ ఒకరి మృతి
భీమారం: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన కొత్తపల్లి గ్రామానికి చెందిన రత్న వేణుగోపాల్‌రెడ్డి (43) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాలు.. భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై రోజూ మద్యం సేవిస్తుండగా భార్య లత హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురై మద్యం సేవించిన మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి 10.30 గంటలకు ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా శనివారం మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
దిలావర్‌పూర్: మండల కేంద్రం దిలావర్‌పూర్ సమీపంలో నిర్మల్ –భైంసా రహదారిపై టోల్‌ఫ్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్యారంగుల తిమ్మయ్య(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు దిలావర్‌పూర్ ఎస్సై రవీందర్ వెల్లడించారు. భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తిమ్మయ్య తన ద్విచక్రవాహనంపై నిర్మల్ వెళ్తుండగా సాయంత్రం దిలావర్‌పూర్ సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తప్రావం కాగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


