ఓటమి.. నైరాశ్యం
ఆసిఫాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగి ఉన్నారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఓడిన అభ్యర్థులు అప్పుల బాధలో ముగినిపోయారు. కొందరు తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడకు చెందిన ఓ అభ్యర్థి ఓటర్ల వద్దకు పసుపు బియ్యంతో వెళ్లగా, శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలో ఓ అభ్యర్థి తన డబ్బులు ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నాడు.
పోటాపోటీగా ఖర్చులు.. తిరిగి వసూలు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ఖర్చు చేశారు. ఫలితాలు వెలువడే వరకూ విజయం తమదే అన్న ధీమాతో అందినకాడికి అప్పు తెచ్చారు. ఖర్చు చేసిన వారిలో కొందరు గెలుపొందగా, కొన్ని పంచాయతీల్లో మాత్రం ఓటర్లు ప్రలోభాలకు లొంగలేదు. కొత్తవారితోపాటు అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం ఉన్నవారికే పట్టం కట్టారు. ఇక ఓటమి చెందిన అభ్యర్థులు అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసిన పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అడుగు మందుకు వేసి ఓటర్ల వద్ద డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారు.
ఉప సర్పంచ్ కోసం..
ఉమ్మడి చెక్‌పవర్ ఉండటంతో జిల్లాలో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి, చిలాటిగూడ పంచాయతీల్లో రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. ఇక్కడ ఉప సర్పంచ్‌కు పోటాపోటీ నెలకొంది. రహపల్లి పంచాయతీ ఏజెన్సీ గ్రామం కాగా, ఇక్కడ 8 వార్డుల్లో 4 ఎస్టీ, 4 జనరల్‌కు రిజర్వ్ చేశారు. నాలుగు వార్డుల్లో ఎన్నికలు జరగగా, బీఆర్‌ఎస్ రెండు వార్డు, బీజేపీ రెండు వార్డులు దక్కించుకున్నారు. దీంతో చివరికి టాస్ వేశారు. బీజేపీ అభ్యర్థి పెంటయ్యను అదృష్టం వరించడంతో ఉప సర్పంచ్‌గా ప్రకటించారు.


