‘సహకార’లోనూ ‘ప్రత్యేక’పాలన
కై లాస్‌నగర్: సహకార శాఖలోనూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)చైర్మన్ల పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో శనివారం సొసైటీల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌గా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార బ్యాంకుకు 2020 ఫిబ్రవరి 25న ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీఆర్‌ఎస్ తరఫున కాంబ్లే నాందేవ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పదవి చేపట్టిన ఏడాదికే 28 జూలై 2021న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. తర్వాత వైస్ చైర్మన్‌గా ఉన్న రఘునందన్ రెడ్డి కొంత కాలం ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగారు. అయితే 29 జనవరి 2022న తాంసి పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న అడ్డి భోజారెడ్డిని చైర్మన్‌గా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి హస్తం పార్టీలో చేరారు. ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అయితే డీసీసీబీ చైర్మన్‌లంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఆరు నెలల పాటు వారి పదవీ కాలం పొడిగించింది. ఈ గడువు శుక్రవారంతో ముగిసింది. ఎన్నికలు జరగకపోవడంతో ఆదిలాబాద్ కలెక్టర్‌కు ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సహకార బ్యాంకు సీఈవో సూర్య ప్రకాశ్ శుక్రవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా కేంద్ర బ్యాంకు వివరాలను వివరించారు. పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిగే వరకూ కలెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు.


